పండిట్లు పుట్టిన గడ్డకు?

స్వదేశంలో శరణార్థులుగా బతకడానికి మించిన దురవస్థ మరొకటి ఉండదు. ఇటువంటి పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు లేదనే చెప్పాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే అక్కడి ప్రభుత్వాలు [more]

Update: 2020-02-20 16:30 GMT

స్వదేశంలో శరణార్థులుగా బతకడానికి మించిన దురవస్థ మరొకటి ఉండదు. ఇటువంటి పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు లేదనే చెప్పాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే అక్కడి ప్రభుత్వాలు స్పందిస్తాయి. వారికి ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటాయి. హక్కుల సంఘాలు శరణార్థుల తరుపున పోరాడతాయి. కోర్టులో చట్టాలు కూడా మౌనం వహించవు. కానీ కశ్మీరీ పండిట్ల పరిస్థితి ఇందుకు మినహాయింపు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మూడు దశాబ్దాల నుంచి స్వదేశంలోనే శరణార్థులుగా భారంగా జీవితాలను కొనసాగిస్తున్నప్పటికీ పట్టించుకునే వారే లేరు. వారి మొరను ఆలకించిన వారు లేరు. వారి కష్టాలు, కడగండ్లు గురించి తెలుసుకున్న నాయకుడు లేడు. కేంద్ర, రాష్ట్ర పాలకులు వారి గోడు విన్న దాఖలాలు లేవు.

ఆశలు చిగురిస్తున్నాయి…

ఆర్టికల్ 370 రద్దు, ఆర్టికల్ 35-A రద్దు తర్వాత వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. తాము పుట్టిన గడ్డకు వెళ్లగలమన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా జన్మస్థలంలో స్వేచ్ఛగా జీవించగలమన్న ఆశ వారి గుండెల్లో మిణుకుమిణుకు మంటోంది. వారు ఇప్పటికే తమ గళాన్ని విన్పిస్తున్నారు. పండిట్ల పాట్లు తెలియాలంటే మూడు దశాబ్దాలు వెనక్కు వెళ్లాలి. జమ్మూ-కాశ్మీర్ లో ముస్లింలే ఎక్కువ మంది ఉన్నప్పటికీ ఆ సంస్థానాన్ని అప్పట్లో హిందూరాజు మహారాజ్ హరిసింగ్ పాలించేవారు. ఆయన కుమారుడే ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ కరణ్ సింగ్. హరిసింగ్ హయాంలో, తదనంతరం కూడా కాశ్మీరీ పండిట్లు స్వేచ్ఛగా జీవించారు.

జేకేఎల్ఎఫ్ ఆవిర్భావం తర్వాత….

1988లో జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) అనే వేర్పాటు వాద సంస్థ ఆవిర్భావంతో పండిట్లకు కష్టాలు ప్రారంభమయ్యాయి. క్రమంగా అది హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించింది. 1989 సెప్టెంబరులో పండిట్ టీ కలాల్ టప్లూ అనే హిందూ నేతను హతమార్చింది. తర్వాత ఉగ్రవాది మక్బుల్ భట్ కు ఉరి శిక్ష విధించిన జడ్జి నీలకంఠ్ గుంజూను కడతేర్చింది. 1989లో వీపీ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్న ముఫ్తీ మహ్మద్ సయీద్ కూతురు రుబియా సయీద్ ను కిడ్నాప్ చేసింద.ి ప్రస్తుత పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సోదరే రుబియా. వారి తండ్రి ముఫ్తీ మహ్మదర్ సయీద్. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదం కాశ్మీర్ లోయ అంతటా విస్తరించింది. కాశ్మీర్ లోయలో ముస్లింలదే ఆధిపత్యం. హిందువులు తక్కువే. జమ్మూలో హిందువులు ఎక్కువ. దీంతో పాకిస్థాన్ ప్రోద్బలంతో రెచ్చిపోయిన ఉగ్రవాదులు కాశ్మీర్ లోయలో పండిట్లను వేధించ సాగారు. వారి ఇళ్లు, ప్రార్థానాలయాలను ధ్వంసం చేశారు. హిందువులు ఉనికి ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలపై దాడులు చేశారు.

ఊచకోత కోయడంతో…

ఈ పరిస్థితుల్లో 1990 జనవరి 19 కాశ్మీరీ పండిట్ల పాలిట కాళరాత్రి. కాశ్మీర్ లోయ రక్తసిక్తమైన రోజు. ఉగ్రవాదులు పేట్రేగి పోయిన వేళ.. ఆరోజు రాత్రి పండిట్లను ఉగ్రవాదులు ఊచకోత కోశారు. దొరికిన వారిని దొరికినట్లు హతమార్చారు. విచక్షణ లేకుండా విధ్వంసకాండ సృష్టించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. పాలకులు కూడా ఉదాసీనంగా వ్యవహరించారు. దీంతో కాశ్మీరీ పండిట్లు కట్టుబట్టలతో లోయ నుంచి వెళ్లిపోయారు. చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు. బతికుంటే చాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్రాన్ని విడిచి వెళ్లారు. ముఖ్యంగా జమ్ము, ఢిల్లీ, యూపీ, హర్యానా తదితర రాష్ట్రాల్లో తలదాచుకున్నారు. కటిక దరిద్రం అనుభవిస్తూ వచ్చారు. దాదాపు ఐదు లక్షల మంది లోయ నుంచి వలస వచ్చినట్లు అంచనా.

పునరాలోచనలో….

ఈ 30 ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా వారిని విస్మరించారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయమని చెప్పవచ్చు. 1990-2010 మధ్య కాలంలో 1300 మందికి పైగా పండిట్లను ఊచకోత కోశారు. ప్రస్తుతం కాశ్మీరీ లోయలో కేవలం 900 కుటుంబాలే ఉన్నాయి. అనంతర కాలంలో వారిని వెనక్కు రప్పించేందుకు ప్రయత్నాలు జరిగినా పాలకుల చిత్తశుద్ధిపై అనుమానంతో పండిట్లు ముందుకు రాలేదు. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దుతో పరిస్థితిలో కొంత మార్పు రావడంతో పండిట్లు పునరాలోచన చేస్తున్నారు. “హమ్ వాపస్ ఆయేంగే” నినాదంతో ముందుకు సాగుతున్నారు. వారి రాకతోనే కాశ్మీర్ లోయ కళకళలాడుతుందన్నది వాస్తవం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News