టాలీవుడ్ లో డాక్టర్ చదివి యాక్ట్రెస్ గా మారుతున్న హీరో రాజశేఖర్, మాజీ హీరోయిన్ జీవిత దంపతుల కూతురు శివాని జోరు మాములుగా లేదు. హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఒక సినిమా విడుదలై క్రేజ్ వచ్చి అవకాశాల మీద అవకాశాలు వచ్చాయంటే అదో అర్ధం. కానీ అమ్మడు నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే... శివానికి మూడు భాషల ఆఫర్స్ రావడం అంటే మాములు విషయం కాదు. శివాని వెండితెర అరంగేట్ర మూవీ హిందీలో ఘన విజయాన్ని సాధించిన 2 స్టేట్స్ ని అడవి శేష్ - శివాని జంటగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఒకేసారి మూడు భాషల్లో అవకాశాలు
మరి ఆ సినిమా విడుదల కాకముందే... శివాని తమిళంలోనూ అడుగు పెట్టింది. అక్కడ వీవీ స్టూడియోస్ నిర్మాతలుగా తమిళ దర్శకుడు వెంకటేశ్ తెరకెక్కిస్తున్న సినిమాలో విష్ణు విశాల్ కి జోడీగా శివాని నటిస్తుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మధురై పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది. హీరో హీరోయిన్ మీద అలాగే సినిమాలో కీలక పాత్రల మీద ఇక్కడ కీలక సన్నివేశాలను దర్శకుడు వెంకటేష్ చిత్రీకరిస్తున్నాడు. మరి తెలుగు, తమిళంలోనే కాదు.. ఇప్పుడు తాజాగా శివాని మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోందనే టాక్ సోషల్ మీడియాలో, ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.
ఒక్క భాషలో హిట్ అయినా చాలు...
మలయాళంలో హీరో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ కి హీరోయిన్ గా శివాని ఎంపికైందనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. మరి అది నిజమో కాదో అనేది పక్కన పెడితే... ఒకేసారి శివాని మూడు భాషల సినిమాలతో ప్రేక్షకుల ముందుకు ఒకేసారి వచ్చేస్తుందన్నమాట. మరో పక్క చాలా మంది ఇక్కడ తెలుగులో ప్రూవ్ చేసుకుని తమిళంలోకి... తమిళంలో ప్రూవ్ అయ్యాక మలయాళంలో అడుగుపెడితే బావుండేది. ఇలా ఒకేసారి మూడు పడవల మీద కాళ్లేసి రిస్క్ తీసుకోవడం అవసరమా అంటున్నారు. ఏది ఏమైనా ఒక డెబ్యూ హీరోయిన్ కి ఇలా ఒకేసారి మూడు భాషల అవకాశాలు రావడం మాత్రం సూపర్. ఎందుకంటే ఒక భాషలో హిట్ అయినా చాలు ఆమె నిలదొక్కుకోవడానికి.