రాష్ట్రంలోనే అత్యధిక స్థానాలున్న తూర్పు గోదావరి జిల్లాలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించబోతోంది. 19 అసెంబ్లీ నియోజకవర్గాలున్న తూర్పు గోదావరి జిల్లాలోకి వచ్చే నెల రెండో వారంలోనే జగన్ పాదయాత్ర ప్రవేశించనుంది. ఈ సందర్భంగా చేరికలు ఎక్కువగా ఉండాలని జగన్ ఆదేశించడంతో స్థానిక నేతలు, రాష్ట్రస్థాయి నేతలు తూర్పు గోదావరి జిల్లా ను జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో జరగుతుంది. కృష్ణా, గుంటూరు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేరికలు జోరుగా జరిగాయి. అదే ఊపును తూర్పులోనూ కొనసాగించాలని జగన్ పట్టుదలతో ఉన్నారు.
రంగంలోకి సీనియర్లు.....
ఈమేరకు సీనియర్ నేతలను రంగంలోకి దించారు. ప్రధానంగా మాజీ ఎంపీ హర్షకుమార్, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లను వైసీపీ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు తీవ్రంగానే జరుగుతున్నాయి.అయితే వీరిద్దరూ ఒకే నిర్ణయం తీసుకుంటారన్న టాక్ కూడా జిల్లాలో విన్పిస్తోంది. ముద్రగడ, హర్షకుమార్ లు తరచూ కలుసుకుని దళిత, కాపు సమస్యలపై చర్చిస్తుంటారు. రెండు సామాజిక వర్గాలు కలిస్తే బలంగా ఉంటామని, శాసించే పరిస్థితి వస్తుందని తెలిసి వీరిద్దరూ అనేకసార్లు సమావేశాలు కూడా జరుపుకున్నారు. ముద్రగడ అరెస్ట్ అయినప్పుడూ హర్ష కుమార్ స్పందించారు. అలాగే హర్షకుమార్ కు కూడా అనేక సందర్భాల్లో ముద్రగడ మద్దతు పలికారు.
ముద్రగడ, హర్షకుమార్ లను.....
ఈ నేపథ్యంలో వీరిద్దరినీ పార్టీలోకి తెచ్చే ప్రయత్నం బాగానే జరగుతున్నట్లు తెలుస్తోంది. జగన్ పాదయాత్ర సమయంలోనే వీరిని పార్టీలోకి తీసుకొస్తే హైప్ వస్తుందని భావిస్తున్నారు. ఈమేరకు సీనియర్ నేతలు ఇద్దరు రాయబారం గత కొద్ది రోజులుగా నడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు సరైన సమయం కాదని, ఎన్నికల ముందు ఇద్దరం సమిష్టి నిర్ణయం తీసుకుంటామని వారికి ముద్రగడ, హర్షకుమార్ లు చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ పాదయాత్ర జిల్లాలో ప్రారంభమయ్యే నాటికి తాను జిల్లాలోనే ఉండనని హర్షకుమార్ తన సన్నిహితులకు చెబుతున్నట్లు సమాచారం. తనపై వస్తున్న వత్తిడిని తట్టుకోలేక జిల్లాలో ఉండకుండా బయటకు వెళుతున్నానని, జగన్ పాదయాత్ర ముగిసిన తర్వాత వస్తానని ఆయన ముఖ్యుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
డబుల డిజిట్ కొట్టాలని......
గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 19 స్థానాలకు గాను వైసీపీ కేవలం ఐదు స్థానాల్లోనే విజయం సాధించింది. జగ్గంపేట, తుని, కొత్తపేట, రంపచోడవరం, ప్రత్తిపాడుల్లో మాత్రమే వైసీపీ గెలిచింది. వీరిలో ముగ్గురు టీడీపీలోకి వెళ్లిపోవడంతో వైసీపీకి అతిపెద్ద జిల్లాలో ఇద్దరే శాసనసభ్యులు ఇప్పుడు మిగిలారు. ఈసారి ఎన్నికల్లో డబుల్ డిజిట్ కు చేరాలన్నది జగన్ లక్ష్యంగా కన్పిస్తోంది. అందుకే చేరికలపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. జనసేన ప్రభావం ఈసారి ఈ జిల్లాలో అధికంగా ఉన్నందున అది తమకు కలసి వస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మరి పాదయాత్ర ప్రారంభమయ్యే సమయానికి జగన్ పంచన ఎవరు చేరుతారో? చేరరో? అన్నది తేలిపోనుంది.