అప్ప… హమ్మయ్య

కర్ణాటకలో ఉప ఎన్నికలు వాయిదా పడటంతో యడ్యూరప్ప ఊపిరి పీల్చుకున్నారు. పదిహేను నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక యడ్యూరప్పకు కష్టంగా మారింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు న్యాయం [more]

Update: 2019-09-27 16:30 GMT

కర్ణాటకలో ఉప ఎన్నికలు వాయిదా పడటంతో యడ్యూరప్ప ఊపిరి పీల్చుకున్నారు. పదిహేను నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక యడ్యూరప్పకు కష్టంగా మారింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు న్యాయం జరగాలని తొలి నుంచి యడ్యూరప్ప వాదిస్తున్నారు. తన ప్రభుత్వం ఏర్పడటానికి కారణమైన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అయన అధిష్టానం వద్ద కూడా మొరపెట్టుకున్నారు. కానీ బీజేపీ నుంచి ఉప ఎన్నికల్లో సీట్ల కోసం వత్తిడి తెస్తుండటంతో పార్టీ కేంద్ర నాయకత్వం కొంత ఆలోచనలో పడింది. దీంతో యడ్యూరప్ప సంకట స్థితిని ఎదుర్కొన్నారు.

వాయిదా పడటంతో…

ఇక వచ్చే నెల 21వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగడం లేదు. ఈ ఉప ఎన్నికలను ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. నియోజకవర్గాలు ఖాళీ అయితే ఉప ఎన్నికను ఆరునెలల్లో జరపాల్సి ఉంటుంది. అయితే అనర్హత వేటు పడి కేవలం రెండు నెలలే కావడంతో మరో నాలుగు నెలల సమయం ఉప ఎన్నికల నిర్వహణకు ఉంది. దీంతో సుప్రీంకోర్టు కూడా వాయిదాకు సరేనంది. దీంతో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రధానంగా యడ్యూరప్పకు గొప్ప ఊరట అని చెప్పక తప్పదు.

రాష్ట్ర సమస్యలపై….

యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టి రెండు నెలలే గడుస్తుంది. పాలనపై పూర్తిగా పట్టు సాధించలేదు. మరోవైపు కర్ణాటకను ఇటీవల వరదలు కుదిపేశాయి. వరద పరిహారం కూడా సక్రమంగా అందించలేకపోయారన్న అపవాదును యడ్యూరప్ప ఎదుర్కొంటున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ వరద సాయం అంతంత మాత్రమే అందించింది. దీంతో ఉప ఎన్నికలకు సమయం దొరకడంతో వరద సాయాన్ని త్వరితగతిన బాధితులకు అందించి బీజేపీకి పాజిటివ్ వేవ్ తీసుకురావాలనుకుంటున్నారు యడ్యూరప్ప.

ప్రెషర్ తగ్గడంతో…..

అలాగే అనర్హతవేటు పడిన ఎమ్మెల్యేల నుంచి కూడా యడ్యూరప్పకు ప్రెషర్ తగ్గిందనే చెప్పాలి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకూ ఆయన తన పని తాను చేసుకునే వీలుంది. ఇదంతా తేలడానికి మరో నెల కన్నా ఎక్కువ సమయం పట్టే అవకాశముంది. ముందుగా పార్టీని బలోపేతం చేసి ఉప ఎన్నికలకు వెళితే తాను ఇక భయం లేకుండా పదవిలో ఉండవచ్చన్నది ఆయన భావన. కనీసం ఎనిమిది సీట్లు గెలుచుకోగలిగితే బేఫికర్. అందుకే తాను ఇచ్చిన హామీలన్నింటినీ అమలు పర్చేందుకు యడ్యూరప్ప సిద్ధమవుతున్నారు. ప్రజల్లో సానుకూలత లభిస్తే అధిష్టానం కూడా తన మాట వింటుందన్నది ఆయన నమ్మకం. మొత్తం మీద యడ్యూరప్ప ఉప ఎన్నికల వాయిదాతో ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News