బాబుకు అతి పెద్ద గుడ్ న్యూస్ చెప్పనున్న జగన్… ?

జగనేంటి చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పడమేంటి అన్నది ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇలాగే జరుగుతూ ఉంటుంది. 2004 ఎన్నికల ముందు చంద్రబాబు కూడా వైఎస్సార్ [more]

Update: 2021-07-07 08:00 GMT

జగనేంటి చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పడమేంటి అన్నది ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇలాగే జరుగుతూ ఉంటుంది. 2004 ఎన్నికల ముందు చంద్రబాబు కూడా వైఎస్సార్ కి ఇలాంటి గుడ్ న్యూసే చెప్పారు. దాంతో ఏలాంటి ఆయాసం లేకుండా వచ్చిన పాదయాత్ర ఇమేజ్ మొత్తం సొంతం చేసుకుని వైఎస్సార్ ఆరు నెలల ముందుగానే ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు. ఇపుడు చంద్రబాబుకు కూడా అలాంటి గుడ్ న్యూసే జగన్ వినిపిస్తారు అంటున్నారు. అంటే ముందస్తు ఎన్నికలు అన్న మాట. మరో మూడేళ్ల వరకూ ఎన్నికలు జరగవు అని చంద్రబాబు తెగ బాధపడుతున్నారు. కేంద్రం కూడా జమిలి ఎన్నికల విషయంలో ఏమీ మాట్లాడడంలేదు. కానీ ఇపుడు హఠాత్తుగా జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారుట.

భారీ వ్యూహంతోనే …?

జగన్ వన్ టైమ్ సీఎం మాత్రమేనని చంద్రబాబు అంటున్నారు. కాదూ తాను మూడు దశాబ్దాల సీఎం అని జగన్ జబ్బలు చరుస్తున్నారు. మరి ఆ కల నెరవేరాలంటే సాఫీగా కధ సాగితే కుదిరే వ్యవహారం కాదు, ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. అందుకే ముందస్తు మంత్రాన్ని జగన్ జపిస్తున్నారు అంటున్నారు. ముందుగా ఎన్నికలు జరిగితే జగన్ కే లాభమని ఎప్పటి నుంచో ఉన్న మాట. జగన్ ఇప్పటికే జనంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అంతే కాదు సంక్షేమ పధకాలను ఆయన చాలా బాగా అమలు చేస్తున్నారు. ప్రజలు కూడా ఇంకా జగన్ మీద మోజు మీద ఉన్నారు. దాంతో ఇలాంటి పరిస్థితుల్లోనే ఎన్నికలకు వెళ్తే పూర్తి ప్రయోజనం సమకూరుతుందని జగన్ పక్కా స్కెచ్ వేశారుట.

లేవకుండానే దెబ్బ ….

ఏపీలో ఇపుడు ప్రతిపక్షం దెబ్బ తిని ఉంది. కేవలం 23 సీట్లతో చంద్రబాబు ఉన్నారు. అందులో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు సైలెంట్ మోడ్ లో ఉన్నారు. రెండేళ్ల కాలంలో టీడీపీకి అన్నీ ఎదురుదెబ్బలే తగిలాయి. రానున్న రోజుల్లోనే పుంజుకోవాలి. సమయం మూడేళ్ళు ఉంటే టీడీపీకి ఆ అవకాశం ఉంటుంది. కానీ అది కాస్తా తగ్గి రెండెళ్లకు కుదిస్తే మత్రం సైకిల్ పార్టీకి ఇబ్బంది కరమే అంటున్నారు. అదే విధంగా బీజేపీ పవన్ కలసినా కూడా టీడీపీ గెలుపునకు ఆమడ దూరంలో ఉండిపోవాలంటే ఏడాది ముందుగా ఎన్నికలు వెళ్ళడమే సరైన మార్గమని జగన్ గట్టిగా తలపోస్తున్నారుట.

అన్నింటికీ ఒక్కటే జవాబు….

జగన్ మీద సీబీఐ కేసుల విచారణ ఓ వైపు వేగవంతం అవుతోంది. మరో వైపు చూస్తే ఆర్ధిక వ్యవస్థ దిగజారుతోంది. ఇంకో వైపు చూస్తే సంక్షేమ పధకాలు అయిదేళ్ళూ ఇచ్చేందుకు వీలుగా అప్పులు కూడా ఎక్కడా పుట్టడం లేదు. దాంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటే మరోమారు భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని జగన్ లెక్కలు వేసుకుంటున్నారుట. అయిదేళ్ళూ పూర్తి అయ్యేసరికి వ్యతిరేకత కూడా బాగా పెరుగుతుందని, నాడు ఎదురీదడం కంటే ఒక ఏడాది ముందుగా ఎన్నికలకు వెళ్తే అన్ని విధాలుగా కలసివస్తుందని జగన్ భావిస్తున్నారుట. మొత్తానికి జగన్ ఆలోచనలు కనుక అమలు అయితే ఏపీలో ఎన్నికలు 2023లో వేసవిలో రావచ్చు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News