Badvel : బద్వేలు వైసీపీ నేతల టెన్షన్… బయటపడతామా?

బద్వేలు ఉప ఎన్నిక చప్పగా ఉంది. ఇక్కడ ప్రధాన పార్టీలేవీ పోటీలో లేకపోవడంతో ప్రచారం కూడా పెద్దగా సాగడం లేదు. బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి [more]

Update: 2021-10-19 11:00 GMT

బద్వేలు ఉప ఎన్నిక చప్పగా ఉంది. ఇక్కడ ప్రధాన పార్టీలేవీ పోటీలో లేకపోవడంతో ప్రచారం కూడా పెద్దగా సాగడం లేదు. బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి దాసరి సుధ బరిలో ఉన్నారు. టీడీపీ బరిలో నుంచి తప్పుకోవడంతో పోటీ నామమాత్రమే అయింది. జనసేన కూడా పోటీలో లేదు. జనసేన పోటీలో ఉన్నా పవన్ కల్యాణ్ సమావేశాలతో కొంత హడావిడి కన్పించేది. కానీ జనసేన కూడా పోటీ లో లేదు. దీంతో వైసీపీ జెండాలే ఎక్కడ పట్టినా కన్పిస్తున్నాయి.

నామమాత్రమే అయినా….

పోటీ నామమాత్రమయినా వైసీపీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. గ్రామాల వారీగా ఇన్ ఛార్జులతో ముఖ్యులు నిత్యం సమావేశమవుతున్నారు. గ్రామాల వారీగా పార్టీకి రావాల్సిన ఓట్ల సంఖ్యను టార్గెట్ పెడుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ భాషా, ఆదిమూలపు సురేష్ లు తరచూ పర్యటిస్తూ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మండలాల వారీగా జగన్ నియమించిన బాధ్యులు అక్కడే మకాం వేశారు.

మెజారిటీపైనే…?

వైసీపీ మాత్రం పూర్తిగా మెజారిటీ పైనే దృష్టి పెట్టింది. టీడీపీ పోటీ లేకపోవడంతో సులువుగా తీసుకోవద్దని, భారీ మెజారిటీ రావాలని జగన్ ఇప్పటికే నేతలను ఆదేశించారు. దీంతో వారి ముందున్న లక్ష్యం పోలయిన ఓట్లలో 90 శాతం ఓట్లు వైసీపీకి రావాలన్నది. 90 శాతం ఓట్లు తెచ్చుకుంటే విపక్షాల నోళ్లు మూయించవచ్చన్న ఆలోచనలో స్థానిక నేతలు కూడా ఉన్నారు. ఈ దిశగా ఏ ఒక్క ఓటరునూ వదిలిపెట్టడం లేదు.

టార్గెట్ రీచ్ అవుతామా?

మండలాల వారీగా ఎమ్మెల్యేలను జగన్ నియమించారు. వీరి పని ఓటర్ల జాబితాను ముందేసుకుని వారిని ఎవరు ఎప్పుడు కలవాలన్నది నిర్ణయిస్తున్నారు. అభ్యర్థితో సంబంధం లేకుండా ఏర్పాటు చేసిన కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి కలిసేలా ప్లాన్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇక్కడ ప్రచారం చేస్తున్నా నామమాత్రమేనని చెప్పాలి. జగన్ నిర్దేశించిన పోలయిన ఓట్లలో 90 శాతం ఓట్లు సాధిస్తామా? లేదా? అన్న టెన్షన్ మాత్రం బద్వేలు వైసీపీ నేతలకు పట్టుకుంది.

Tags:    

Similar News