ఆ ఏడింటా తిరుగులేదట
రాష్ట్రంలో ఏడు గిరిజన నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ నియోజకవర్గాలు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలలోనే ఉండడం గమనార్హం. అయితే, ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నేతల హవానే [more]
రాష్ట్రంలో ఏడు గిరిజన నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ నియోజకవర్గాలు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలలోనే ఉండడం గమనార్హం. అయితే, ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నేతల హవానే [more]
రాష్ట్రంలో ఏడు గిరిజన నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ నియోజకవర్గాలు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలలోనే ఉండడం గమనార్హం. అయితే, ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నేతల హవానే కనిపి స్తోందని తాజాగా ప్రభుత్వానికి అందిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయట. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ విజయం సాధించింది. అందునా ఏడింట నాలుగు చోట్ల వైసీపీ నుంచి మహిళలే విజయం సాధించడం గమనార్హం. ఇక, ఆయా నియోజకవర్గాల్లో త్వరలోనే జరగనున్న స్థానిక ఎన్నికల వేడి అప్పుడే రాజుకుందని కూడా తెలుస్తోంది.
పాలకొండ: శ్రీకాకుళం జిల్లాలోని ఈ నియోజకవర్గంలో వైసీపీ నాయకురాలు విశ్వసరాయి కళావతి వరుస విజయాలు సాధించారు. కళావతి అక్కగా ఇక్కడ సుపరిచితురాలైన ఆమె స్థానికంగా అందరికీ తలలో నాలుకలా ఉంటారనే పేరు తెచ్చుకున్నారు. ఏ సమస్య వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా అధికారులను ఒప్పించి పరిష్కరించడం ద్వారా ఇక్కడి వారికి చేరువయ్యారు. గిరిజనుల విద్య, వైద్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఆమె చెప్పిందే వేదం. ఆమె మాటకు తిరుగులేదనే భావన ఉంది. వివాద రహితురాలిగా అందరినీకలుపుకొని పోతూ పార్టీని డెవలప్ చేస్తున్నారు. ఎస్టీ కోటాలో ఆమెకు రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
కురుపాం: విజయనగరం జిల్లా కురుపాం నియజకవర్గంలో వైసీపీ నాయకురాలు పుష్ప శ్రీవాణి వరుసగా విజయం సాధించారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ పార్టీ నేతలకు చేరువలో ఉంటారని, వారి కష్టాలు తీరుస్తారని పేరు తెచ్చుకున్నారు. పార్టీలోనూ దూకుడుగా నిర్ణయాలు తీసుకునే నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వ పథకాలను గిరిజనులకు చేరువ చేయడంలో మంత్రి ముందున్నారు. త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై తనదైన వ్యూహంతోపాటు పార్టీ పెద్దల వ్యూహాలను కూడా కలుపుకొని ముందుకు సాగేలా పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ రాజన్నదొరతో ఈమెకు రాజకీయంగా వైరుధ్యం ఏర్పడింది.
సాలూరు: విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో గెలిచిన పీడిక రాజన్నదొర కొంత అసంతృ ప్తితో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. మంత్రి వర్గంలో చోటు సంపాయించాలని భావించిన ఆయనకు జగన్ ఛాన్స్ ఇవ్వలేదు. వైఎస్ హయాం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్న రాజన్నదొరకు కూడా స్థానికంగా మంచి పేరుంది. వివాద రహితుడిగా అందరినీ కలుపుకొని పోతున్నా.. ఆయనలోని అసంతృప్తి కారణంగా పార్టీ పెద్దలతో టచ్‌లో ఉండలేక పోతున్నారు. అయితే, స్థానికంగా బలమైన మెజారిటీ సాధించేందుకు మాత్రం ఆయన తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో సీనియర్ అయినా మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో ఉన్న ఆయనకు అదే జిల్లాకు చెందిన మంత్రి బొత్సతో ఏ మాత్రం పొసగడం లేదు.
అరకు: విశాఖ జిల్లా అరకు నియజకవర్గం నుంచి తొలిసారి విజయం సాధించిన శెట్టి ఫల్గుణ వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు ఆత్మీయుడిగా పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై పోరాటం చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విద్య, వైద్యం, రోడ్లు వేయించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. అయితే, ఇక్కడి టీడీపీ నేతలు కూడా దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. దీంతో వైసీపీ నాయకులను ఏకతాటిపైకి తెచ్చి పార్టీని ముందుకు నడిపించేందుకు శెట్టి ఫల్గుణ శాయశక్తులు ఒడ్డుతున్నారని అంటున్నారు. ప్రభుత్వ పథకాలే పార్టీని ముందుకు నడిపిస్తాయని చెబుతున్నారు.
పాడేరు: విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి తొలిసారి విజయం సాధించిన కొత్తగుల్లి భాగ్యలక్ష్మి దూకుడుగా ఉన్నారు. జగన్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. వచ్చే రెండేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ జరిగితే తన పేరును పరిశీలనలో చూసేలా ఆమె కృషి చేస్తుండడం గమనార్హం. ప్రతి కార్యక్రమానికీ మిస్ అవకుండా హాజరవుతున్నారు. ప్రతి ఒక్కరినీ కలుసుకుంటున్నారు. ప్రతి పనినీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దూర ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వైద్య, విద్యం వంటి సదుపాయాలను అందించేందుకు కృషి చేస్తున్నారు.
రంపచోడవరం: తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నుంచి తొలిసారి గెలిచిన నాగులపల్లి ధనలక్ష్మి రాజకీయాలకు కొత్తే అయినా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు మాత్రం ముందున్నా రు. అదేసమయంలో పార్టీ నేతలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని మరింతగా పుంజుకునేలా చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. వాస్తవానికి 2014లోనూ ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. అయితే, అప్పట్లో గెలిచిన రాజేశ్వరి తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎన్నికల సమయానికి ఆమెను పార్టీలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఆమె వస్తే తన హవాకు ఎక్కడ ఇబ్బంది ఏర్పడుతుందోనని భావిస్తున్న ధనలక్ష్మి తనవల్ల ఎలాంటి పొరపాట్లు లేకుండా పార్టీని ముందుకు నడిపిస్తుండడం గమనార్హం.
పోలవరం: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో విజయం సాధించిన తెల్లం బాలరాజు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ తరపున గెలిచిన ఆయన వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో పార్టీ సత్తాను, తన సత్తాను నిరూపించుకుని, జగన్ రెండేళ్ల తర్వాత మంత్రి వర్గాన్ని విస్తరిస్తే తనకు చోటు లభించేలా దూకుడుగా ముందుకు సాగుతున్నారని సమాచారం. ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు, వైసీపీ నుంచి మూడు సార్లు గెలిచిన బాలరాజుకు నియోజకవర్గంలో చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నాయి. మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి కూడా ఆయనలో ఉంది. ఏదేమైనా.. గిరిజన నియోజకవర్గాల్లో వైసీపీ దూకుడు ముందు విపక్షాలు నిలవలేక పోతున్నాయని అంటున్నారు పరిశీలకులు.