గుత్తా రాజీనామా ఎప్పుడంటే?

Update: 2017-09-28 13:30 GMT

నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామాపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. దసరా తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముందని చెబుతున్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి చేత పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళదామని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఇంతవరకూ రైతు సమన్వయసమితి కో -ఆర్డినేటర్ గా కూడా గుత్తాను నియమించలేదు. అయతే దీనిపై కేసీఆర్ ఆలోచన వేరే విధంగా ఉన్నట్లు గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ సమస్యలను పరిష్కరించే దిశగా తొలుత ప్రయత్నించి తర్వాత ఎన్నికలకు వెళ్లాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ఆ జిల్లా నేతలతో పాటు అధికారుల చేత కూడా కేసీఆర్ నివేదికను అడిగారు. నివేదిక వచ్చిన వెంటనే కేసీఆర్ రెండు రోజుల పాటు నల్లగొండ జిల్లాలో పర్యటిస్తారని కూడా గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే కేసీఆర్ పర్యటన వచ్చే 11, 12 తేదీల్లో ఉండొచ్చన్న ఫిల్లర్ కూడా ఆ పార్టీ నేతలు ఇప్పటికే వదిలారు. సూర్యాపేటతో పాటు, నల్లగొండలోనూ కేసీఆర్ పర్యటన ఉంటుందని చెబుతున్నారు.

అంతా ఓకే అయిన తర్వాతే.....

నల్లగొండ జిల్లలో ఇంతవరకూ అమలయిన అభివృద్ధి పనులతో పాటు పెండింగ్ పనుల జాబితాను కూడా కేసీఆర్ అడిగారు. యాదాద్రి ధర్మల్ ప్లాంట్ తో పాటు మరికొన్ని ప్రాజెక్టులపై కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ నల్లగొండ పర్యటన సందర్భంగా మరికొన్ని ప్రాజెక్టులను కూడా ప్రకటించే అవకాశముంది. దీనిపైనే అధికారుల నుంచి కేసీఆర్ నివేదిక తెప్పించుకోనున్నారు. నల్లగొండ జిల్లాలోని మిర్యాల గూడ, దేవరకొండ, నల్లగొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల అధికారులతో సమీక్ష కూడా చేసినట్లు తెలుస్తోంది. నల్లగొండలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా కేసీఆర్ టూర్ సందర్భంగా ప్లాన్ చేయాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అంతేకాకుండా నిధులు కూడా వెంటనే విడుదల చేయనున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవం కూడా ఇందులో ఉంటుందని చెబుతున్నారు. బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతలపథకాన్ని కూడా డిసెంబర్ లోపల పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అన్ని అభివృద్ధి పనులు మంజూరు చేసిన తర్వాత, కేసీఆర్ పర్యటించి పూర్తి స్థాయి సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత గుత్తా చేత రాజీనామా చేయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద నల్లగొండ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక వస్తుందా? రాదా? అనే అంశంపై పొలిటికల్ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది.

Similar News