యాభై శాతం ఎమ్మెల్యేలను మారిస్తేనే టీడీపీకి గెలుపన్న జేసీ

Update: 2017-08-13 07:30 GMT

అనంతపురం ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపు నుంచి యాభై శాతం మంది కొత్త అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తేనే టీడీపీ గెలుపు సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందన్న జేసీ కొత్త వారినే శాసనసభకు అభ్యర్థులుగా ఎంపిక చేయాలన్నారు. 2018 ఆఖరులోనే ఎన్నికలు వస్తాయని జేసీ జోన్యం చెప్పారు. వచ్చే జనవరిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముందన్న జేసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉండాలన్నారు. ఈ మేరకు తాను చంద్రబాబుతో అన్ని విషయాలనూ చెప్పానన్న జేసీ, వాటిని అమలులో పెడతారా? లేదా? అన్న విషయం ఆయనే ఆలోచించుకోవాలన్నారు.

పల్లె రఘునాధరెడ్డిపై సెటైర్లు.........

నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమన్న జేసీ స్పల్ప మెజారిటీతో భూమా బ్రహ్మానందరెడ్డి బయటపడతారని చెప్పారు. ఎన్నికల్లో ప్రలోభాలు జరుగుతున్నాయా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు జేసీ సమాధానమిస్తూ నెహ్రూ హయాంలో లేవేమో కాని, ఇప్పుడు అవన్నీ మామూలు విషయమేనని సంచలన ప్రకటన చేశారు. అలాగే పుటపర్తి ఎమ్మెల్యే, మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డిపై కూడా జేసీ దివాకర్ రెడ్డి సెటైర్లు వేశారు. పల్లె రఘునాధరెడ్డి మంచోడని, మెతక స్వభావం కలిగిన వ్యక్తి అని, మంత్రిగా సరిగా పనిచేయలేక పోయారని జేసీ అభిప్రాయపడ్డారు. కొందరికైనా మేలు చేస్తేనే ఆ పదవి చేపట్టిన వ్యక్తికి గౌరవం లభిస్తుందని జేసీ అన్నారు. చంద్రబాబుపై జగన్ వ్యక్తిగత దూషణలకు దిగడం తగదన్నారు.

Similar News