Maharashtra Elections : ఇక జమిలి ఎన్నికలకు మోదీ సై అనేస్తారుగా?
మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. జమిలి ఎన్నికలకు మోదీ సిద్ధమవుతారు
మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని మరాఠా ప్రజలు కమలం కూటమికి ఓటేశారని భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమికి ప్రజలు అధికారం కట్టబెట్టినప్పటికీ తర్వాత శివసేన కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గు చూపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో తర్వాత కాంగ్రెస్ కూటమిని కూలదోసి బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఏక్ నాధ్ షిండే పాలనను కూడా ప్రజలు చూశారు. ఉద్ధవ్ థాక్రే తో పాటు శరద్ పవార్ ను కూడా ప్రజలు విశ్వసించలేదని ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతుంది.
వన్ సైడ్ రిజల్ట్ ...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వన్ సైడ్ ఫలితాలు రావడంతో ఇక మోదీ జమిలి ఎన్నికలకు సిద్ధమవుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2027 లో జమిలి ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో మోదీ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత జమిలి ఎన్నికలకు ఇక మోదీ సర్కార్ సిద్ధమవుతుందని అంచనాలు హస్తిన వీధుల్లో వినిపిస్తున్నాయి. అన్ని పక్షాల మద్దతును కూడగట్టి జమిలి ఎన్నికలకు వీలయినంత త్వరగా వెళ్లాలన్న యోచన ఇక స్పీడ్ అందుకోనుందని చెబుతున్నారు.
స్ట్రయిక్ రేట్...
ఇప్పటి వరకూ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కోసమే మోదీ అండ్ టీం ఎదురు చూస్తుంది. ఈసారి మహారాష్ట్రలో 120 స్థానాలకు పైగా గెలుచుకుని కూటమి అయితే రెండు వందలకు పైగా స్థానాలను గెలుచుకునే అవకాశాలుండటంతో ప్రజలు ఒకవైపే చూస్తారని అర్థమవుతుంది. అందుకే జమిలి ఎన్నికలకు వెళితే మంచిదన్న యోచనలో కమలనాధులున్నారు. గతంలో కంటే ఎక్కువ స్థానాలు మహారాష్ట్రలో సాధించడంతో ఇక మోదీ వెనుదిరిగి చూసే అవకాశం లేదనిపిస్తుంది. ఇక దూకుడుగా జమిలి ఎన్నికలకు మోదీ సర్కార్ సిద్ధమవుతారనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఒకేసారి ఎన్నికలు జరిపితే ఇక కోడ్ అమలులోకి రాదని, అభివృద్ధి పనులు సజావుగా జరగే అవకాశముందని బీజేపీ పదే పదే చెబుతుంది.
మద్దతు కూడగట్టి...
ఈ నేపథ్యంలోనే జమిలి ఎన్నికలను ఇక ఆపడం ఎవరి తరం కాదన్నది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. 2026లో దేశ వ్యాప్తంగా జనగణన పూర్తవుతున్న నేపథ్యంలో 2027లో దేశమంతా ఒకే సారి ఎన్నికలను నిర్వహించాలన్నది మోదీ సర్కార్ నిర్ణయం. అయితే దీనికి కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలుపుతుంది. అయితే బీజేపీ కూటమి పార్టీలతో పాటు దాని మిత్ర పక్షాలు కూడా ఈ ప్రతిపాదనను సమర్ధించడంతో వేగిరం జమిలి ఎన్నికలకు వెళ్లి నాలుగోసారి అధికారంలోకి రావాలన్న ఆలోచనతో మోదీ సర్కార్ ఉంది. మొత్తం మీద మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు జమిలి ఎన్నికలకు మరింత వేగం పెంచుతాయని చెప్పకతప్పదు.