Nadendla Manohar : నాదెండ్ల మీద నారాజ్ గా ఉన్నారా?
మంత్రి నాదెండ్ల మనోహర్ తీరుపై జనసేన నేతలు అసంతృప్తిగా ఉన్నా పవన్ కల్యాణ్ మాత్రం కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు;

ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ మీద జనసేన కీలక నేతలు ఆగ్రహంగా ఉన్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. పదవులు విషయానికి వచ్చేసరికి పవన్ కల్యాణ్ తమను పట్టించుకోకపోవడానికి నాదెండ్ల మనోహర్ చేస్తున్న డైరెక్షన్ కారణమని పలువురు నేతలు నేరుగానే ఆరోపిస్తున్నారు. కొందరు జనసేన కార్యకర్తలు అయితే తాము పవన్ కు అభిమానులమని, జనసేన బలోపేతం చేయడానికి పనిచేస్తామని, కానీ నాదెండ్ల మాత్రం అందుకు విరుద్ధంగా పనిచేస్తూ తనకు అనుకూలంగా ఉన్న వారి పేర్లను మాత్రమే పవన్ కు సిఫార్సు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొందరు నేతలు ఇప్పటికే రాజీనామాలు చేయగా,మరికొందరు తమ రాజీనామాలకు కారణం చెప్పకుండా అధికారంలో ఉండి కూడా పక్కకు తప్పుకుంటున్నారు.
సోషల్ మీడియాలో...
ఇది ప్రధానంగా పవన్ కల్యాణ్ పై ఉన్న అసంతృప్తి కన్నా నాదెండ్ల మనోహర్ పైనే అని పార్టీలో సీనియర్ నేత ఒకరు తెలిపారు. నాదెండ్ల మనోహర్ జనసేనలో ఉంటూ తెలుగుదేశం పార్టీ కోవర్టుగా పనిచేస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక కాపు నాయకుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. నాదెండ్ల మనోహర్ కు పవన్ కల్యాణ్ ఇస్తున్నప్రాధాన్యతను చూసి తాము మాట్లాడలేకపోతున్నామని, గతంలో ఆయన వల్ల ఎంత మంది నేతలు పార్టీని వదిలిపెట్టారన్న విషయం అందరికీ తెలుసునని మరికొందరు గుర్తు చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ తమకు ఇవ్వడం లేదని, పార్టీ పదవుల్లోనూ తమకు అన్యాయం జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు.
నమ్మకమైన నేతగా...
కానీ నాదెండ్ల మనోహర్ తొలి నుంచి పవన్ కల్యాణ్ కు నమ్మకమైన నేతగా ఉన్నారు. ఆయన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకూ ఒక్క మచ్చపడకూడా పడలేదు. అవినీతి ఆరోపణ కూడా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ చాలా బ్యాలన్సడ్ గా పనిచేశారన్న ప్రశంసలు అందుకున్నారు. అందుకే పవన్ కల్యాణ్ ఇటు రాజకీయ అనుభం, అటు నీతిమంతమైన పొలిటికల్ కెరీర్ ను చూసి ఆయన చెప్పినట్లు నడుచుకుంటున్నారనే వారు కొందరున్నారు. అయితే జిల్లాల్లో పెత్తనం చేస్తున్నారన్న ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఆదేశాలను మాత్రమే నాదెండ్ల అమలు చేస్తారంటున్నారు. అందుకే ఆయనపై ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా పవన్ కల్యాణ్ లైట్ గానే తీసుకుంటారన్నారు.
నెంబరు టూగా...
జనసేనలో ఎవరు అవునన్నా కాదన్నా నాదెండ్ల మనోహర్ నెంబర్ 2 అని చెప్పక తప్పదు. నాగబాబు పార్టీలో ఉన్నప్పటికీ ఆయనకు రాజకీయ అనుభవం లేకపోవడంతో నాదెండ్ల చెప్పిన రూట్ లోనే పవన్ వెళతారు. అలాగని రాంగ్ డైరెక్షన్స్ ఇచ్చే పని చేయరు. పవన్ ప్రతిష్టకు మచ్చ తెచ్చే విధంగా ఎలాంటి సలహా ఇవ్వరు. పవన్ మనస్తత్వం తెలిసిన నాదెండ్ల మనోహర్ అందుకు అనుగుణంగానే నడుచుకుంటారు. టీడీపీతో సమన్వయం చేసినా అచ్చుగుద్దినట్లు పవన్ చెప్పిన విషయాలను మాత్రమే చెప్పి వస్తారు కానీ అక్షరం పొల్లు పోనివ్వరని కూడా సీనియర్ నేతలు చెబుతుంటారు. అందుకే ఆయనకు అన్ని రకాల ముఖ్యమైన బాధ్యతలను పవన్ అప్పగిస్తారని, ఎవరు ఎన్ని గింజుకున్నా నాదెండ్ల మనోహర్ పై పవన్ ఈగ వాలనివ్వరన్నది మాత్రం అందరూ గుర్తుంచుకుంటే మంచిదని సూచిస్తన్నారు.