Ys Jagan : జగన్ టర్న్ అయింది.. అదే కారణమా? వర్క్ అవుట్ అవుతుందా?
వైసీపీ అధినేత జగన్ ఇక ఎఫెన్స్ లోనే వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది.;

వైసీపీ అధినేత జగన్ ఇక ఎఫెన్స్ లోనే వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. నిన్న రాప్తాడు పర్యటనతో ఈ విషయం స్పష్టమవుతుంది. రెడ్ బుక్ పాలనపై ఆయన విరుచుకుపడటంతో పాటు పోలీసుల తీరును కూడా తప్పపట్టడంతో ఇక ఆయన మరింత దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకూ జగన్ ఎన్నికల్లో హామీలు అమలు చేయడం లేదని, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శిస్తూ వచ్చారు. కీలక నేతలను అరెస్ట్ చేస్తున్నా వారిని పరామర్శించేందుకు వెళ్లి కొంత వరకూ ప్రభుత్వ విధానాలను దుయ్యబడుతూ వచ్చారు. ఇక ఎఫెన్స్ గా వెళుతూ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తుంది.
నేరుగా విమర్శించడం...
జనంలోకి వెళ్లడమే కాకుండా నేరుగా పోలీసులపై విమర్శలు చేస్తే మరింత క్రేజ్ క్యాడర్ లో ఏర్పడుతుందని జగన్ అంచనాకు వచ్చినట్లుంది. అందుకే రాప్తాడులో తన టార్గెట్ అంతా పోలీసులపైనే చేశారు. మూడు సింహాలకు పోలీసులు సెల్యూట్ చేయకుండా టీడీపీ నేతలకు గులాంగిరీ చేస్తున్నారని అనడంతో క్యాడర్ నుంచి విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. చంద్రబాబుకు వాచ్ మెన్ లా పోలీసులు పనిచేస్తున్నారంటూ ఒక అడుగుముందుకేసి జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా పోలీసులను ఇబ్బందిపెట్టేవిగా ఉన్నాయి. అయితే జగన్ కామెంట్స్ కు పోలీసు అధికారుల సంఘం ఖండించినప్పటికీ కార్యకర్తలు మాత్రం ఫుల్లు ఖుషీ అవుతున్నారట.
రూట్ మార్చి మరీ...
అందుకే జగన్ తన రూటు మార్చారంటున్నారు. ఇటు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలను విమర్శలు చేస్తూ అటు పోలీసులను లక్ష్యంగా చేసుకుంటే క్యాడర్ మరింత ఉత్సాహంగా బయటకు వస్తుందని జగన్ అంచనాలు వేసుకుంటున్నట్లు కనపడుతుంది. అందుకే పోలీసులను ఒకరకంగా ఇబ్బందిపెట్టే వ్యాఖ్యలను చేస్తున్నారు. శాంతి భద్రతలపైనే ఎక్కువ జగన్ ఫోకస్ పెట్టినట్లు కనపడుతుంది. ఎక్కువ మంది వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు అక్రమంగా నమోదు చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్లకు పిలిపించి తమ దైన శైలిలో విచారించడం వల్ల కూడా వైసీపీ క్యాడర్ లో పోలీసులంటే ఒకరకమైన భయంతో కూడిన వ్యతిరేక ధోరణి పెరిగిపోయింది.
రెడ్ బుక్ తో పాటుగా...
దానిని క్యాష్ చేసుకునే దిశగా జగన్ ప్రయత్నం ప్రారంభించినట్లు కనపడుతుంది. రెడ్ బుక్ ను అమలు చేయడంలో లోకేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారంటూనే, మరొకవైపు తమ పార్టీ కార్యకర్తలను, నేతలను వేధించి అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులు తాము అధికారంలోకి రాగానే ఎక్కడ ఉన్నా వారిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇస్తున్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా ఇప్పుడు చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తారంటూ జగన్ తన డైలాగుల్లో సింహభాగం పోలీసులకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్లు కనపడుతుంది. చూసే వారికి మాత్రం జగన్ డైలాగ్ లు మార్చడం వెనక క్యాడర్ ను త్వరగా జెండా వైపు తిప్పుకోవడానికేనంటున్నారు. మరి ఈ డైలాగ్ లు ఎంత మేరకు పనిచేస్తాయన్నది చూడాల్సి ఉంది.