Pawan Kalyan : ఊ అనడమేనా.. ప్రశ్నించడం మర్చిపోయినట్లేనా?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.;

Update: 2025-04-15 07:33 GMT
pawan kalyan, deputy chief minister, silence, capital amaravathi
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. 2014లో నాడు బీజేపీ, టీడీపీ కూటమికి పరోక్షంగా మద్దతిచ్చిన పవన్ కల్యాణ్ 2019 ఎన్నికలకు వచ్చేసరికి విభేదించారు. సొంతంగా పోటీ చేసిచేతులు కాల్చుకున్నారు. నాడు అమరావతి రాజధాని రైతుల నుంచి 32 వేల ఎకరాల మూడు పంటల భూమిని సేకరించడాన్ని పవన్ కల్యాణ్ తప్పుపట్టారు. రాజధానికి అంత భూములు అవసరమా? అని ప్రశ్నించారు.అంతేకాదు నాడు ఒకడుగు ముందుకేసి రాజధాని ప్రాంతంలో పర్యటించి భూములు తీసుకున్న రైతులకు అండగా నిలబడతానని భరోసా కూడా ఇచ్చి వచ్చారు.

వాయిస్ ను మార్చి...
అయితే 2024 ఎన్నికల నాటికి ఆయన వాయిస్ మారింది. రాజధాని రైతుల విషయంలో ఆయన తన స్టాండ్ ను మార్చుకున్నారు. అసలు నాడు ప్రశ్నించిన దానిని మర్చిపోయారనిపిస్తుంది. రహదారుల కోసం ఇళ్లను కూల్చివేస్తే ఇప్పటంలో హడావిడి చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మౌనంగా ఉండటమేంటని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం రాజధాని అమరావతి కోసం మరో నలభై వేల ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. రాజధాని కోర్ కాపిటల్ బయట నలభై ఎకరాలు సేకరించి భవిష్యత్ అవసరాల కోసం ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాజధాని రైతుల సమ్మతితోనే అయినా...
కానీ పవన్ కల్యాణ్ దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అధికారంలో లేనప్పుడు ఒకలా, ఉన్నప్పుడు మరొకలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే రాజధాని రైతులు తమ సమ్మతితోనే భూములు ఇస్తుండటంతో పవన్ కల్యాణ్ మౌనంగా ఉంటున్నారని జనసేననేతలు చెబుతున్నారు. గతంలో రాజధాని భూముల విషయంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ కల్యాణ్ నేడు మౌనంగా ఉండటాన్ని ఆయన సర్దుకుపోయే మనస్తత్వానికి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రైతులు అంగీకరించినా అంత పెద్ద స్థాయిలో అంటే ఒక్క రాజధాని నిర్మాణం కోసం 77 వేల ఎకరాలను సేకరించడాన్ని ప్రశ్నించకపోతే ప్రజల తరుపున ఏమి చేస్తారంటూ నిలదీస్తున్నారు. కనీసం అభ్యంతరం కూడా చేయకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత...
ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కల్యాణ్ పూర్తిగా ఛేంజ్ అయినట్లు కనపడుతుంది. మిత్ర ధర్మంతో చంద్రబాబు నాయుడు కు మద్దతు ఇవ్వడంలో తప్పులేదు. అదే సమయంలో ఆయన పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవడాన్ని కూడా ఎవరూ ఆక్షేపించరు. కానీ ప్రజాసమస్యలపై పోరాడతానని పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మూగనోము పట్టడం పైనే సర్వత్రా ఆయన వైఖరిపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందరి రాజకీయ నేతల్లాగే పవన్ కల్యాణ్ కూడా అధికారానికి దాసోహం అని అంటున్నారని, ప్రశ్నించడమే మానేశారన్న కామెంట్స్ నెట్టింట బలంగా వినిపిస్తున్నాయి. ఇలాగే వ్యవహరిస్తూ ఈ నాలుగేళ్లలో ఉన్న ఇమేజ్ కోల్పోయే అవకాశముందన్న హెచ్చరికలు వినపడుతున్నాయి.


Tags:    

Similar News