Tollywood : ఇండ్రస్ట్రీ ఏపీకి తరలిపోతుందా? ఏందీ రచ్చ గురూ?

తెలగు చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొంటుందన్న భావన ఏపీ నేతల్లో వ్యక్తమవుతుంది

Update: 2024-12-25 11:48 GMT

తెలగు చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొంటుందన్న భావన ఏపీ నేతల్లో వ్యక్తమవుతుంది. సినీ పరిశ్రమ ఏపీకి తరలి రావాలని పిలుపు నిస్తున్నారు. అయితే ఇందులో సాధ్యాసాధ్యాలను మాత్రం పరిశీలించడం లేదు. మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిస్థిరపడటానికి సినీ పరిశ్రమకు చాలా సమమయేపట్టింది. తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు చెన్నై వైపుకు కూడా చూడటం లేదు. ఎందుకంటే ఇక్కడ 24క్రాఫ్ట్స్ కు సంబంధించి అన్ని అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాలుగా రవాణా సదుపాయాలున్నాయి. స్టూడియోలున్నాయి. డబ్బింగ్ థియేటర్ లు ఉన్నాయి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. నిజం చెప్పాలంటే లక్షలాది మంది హైదరాబాద్ లోని చిత్ర పరిశ్రమ పై ఆధారపడి జీవిస్తున్నారు.

24 క్రాఫ్ట్స్ అన్నీ...
నిర్మాతల నుంచి దర్శకుల వరకూ.. మ్యూజిక్ డైరెక్టర్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ వరకూ ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. హీరోలు, హీరోయిన్లు ఒక్కరేమిటి? చిత్ర పరిశ్రమ అంతా ఇక్కడ స్థిరపడిపోయింది. తట్టా బుట్టా సర్దుకుని రాత్రికి రాత్రి బయలుదేరడానికి ఇది ఒక కుటుంబం కాదు. ఏదో ఒక సినిమాకు ఇబ్బంది ఏర్పడిందని, ఒక హీరో అరెస్టయ్యారని, బెనిఫిట్ షోలను రద్దు చేశారని, టిక్కెట్ ధరలను పెంచలేదని వెళ్లిపోయేంత సీన్ చిత్ర పరిశ్రమలో లేదు. ఒక సినిమా రూపుదిద్దుకోవాలంటే అన్నీ రెడీ మేడ్ గా క్షణాల్లో అందుబాటులో ఉండే హైదరాబాద్ ను వదులకుని ఏపీకి తరలివెళ్లాలని భావించడం కొద్దిసేపు మాట్లాడుకోవడానికే కాని ఆచరణ సాధ్యంకాదు.
మూలాలు అక్కడున్నా...
అదే సమయంలో హైదరాబాద్ నగరం లో ఉన్న వాతావరణంతో పాటు ఇక్కడి కల్చర్ కు అలవాటుపడిపోయిన వారు ఏపీకి వెళ్లేందుకు కూడా ఎవరూ సుముఖంగా ఉండరు. నిజమే చిత్ర పరిశ్రమలో 70 శాతం మంది ఏపీకి చెందిన వారు అయినా వారి మూలాలు మాత్రం ఏపీలో ఉన్నాయి తప్పించి, వారి ఆస్తులన్నీహైదరాబాద్ లోనే ఉన్నాయి. స్టూడియోలు నిర్మించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ అరెస్ట్, టాలీవుడ్ పై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏమాత్రం ప్రభావం చూపవంటున్నారు. ఏదైనా ఒక పరిశ్రమ అయితే వెంటనే బిచాణా ఎత్తేసి వెంటనే వేరే ప్రాంతానికి తరలి వెళ్లిపోవచ్చు. అనేక అంశాలతో ముడిపడిన పరిశ్రమ కావడంతో ఇక్కడి నుంచి కదిలేందుకు ఎవరూ సుముఖత చూపరన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. గతంలోనూ అనేక ఇబ్బందులు టాలీవుడ్ కు వచ్చాయి. అయినా వాటిని అధిగమించి హైదరాబాద్ హద్దులను దాటి వెళ్లలేదు.
షూటింగ్ లకు వెళ్లాలంటే..?
ఇక షూటింగ్ ల విషయంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు అమెరికాకు వెళ్లి కూడా మనోళ్లు చేస్తున్నారు. ఎక్కడైనా షూటింగ్ చేసుకునే వీలుంది. కథకు అవసరమైన ప్రాంతాల్లోనే షూటింగ్ చేస్తారు. సముద్ర తీరంలో షూటింగ్ చేయాల్సి వస్తే ఏపీకో, తమిళనాడుకో వెళతారు. అది వారం రోజుల ముచ్చట. కేవలం ఒకరికి వచ్చిన సమస్యతో ఇండ్రస్ట్రీ తరలిరావాలని పిలుపునివ్వడం కూడా అత్యాశే అవుతుంది. ఏపీలో సినిమా ఇండ్రస్ట్రీ అభివృద్ధి చెందడానికి కొన్ని దశాబ్దాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ హైదరాబాద్ నుంచి ఒక్కరూ కదలకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పాలి. కనీసం ఏపీలో సొంత ఇళ్లు కూడా లేని వారు అనేకమంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. విశాఖలో రామానాయుడు స్టూడియో ఎప్పుడో నిర్మించినా అక్కడ షూటింగ్ లు జరగడం అరుదేనని చెప్పాలి.తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇలాంటి ప్రచారమే జరిగింది. కానీ ఇండ్రస్ట్రీ ఎక్కడికీ వెళ్లేదు. ఇక్కడే ఉంది. రేపు కూడా ఇదే జరుగుతుంది. జరుగుతున్న పరిణామాలన్నీ విశ్రాంతి వరకూ ఉన్నది మాత్రమే. ఎండ్ కార్డు మాత్రం హైదరాబాద్ లోనే పడుతుంది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ 


 

 

Tags:    

Similar News