Chandrababu : సమాజంలో మార్పు కోసమే పీ4 పథకం
పేదలకు అండగా నిలవాల్సిన బాధ్యత సంపన్నులపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు;

పేదలకు అండగా నిలవాల్సిన బాధ్యత సంపన్నులపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సమాజం నుంచి ఎదిగిన వాళ్లు పేదలకు న్యాయం చేయాలని చంద్రబాబు అన్నారు. అమరావతిలో పీ4 పథకాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ఎందరో ఎన్నో కోట్లు సంపాదిస్తారని, కానీ అందులో దొరకని ఆనందం పేదలకు సహాయం చేయడం ద్వారా లబ్ది పొందుతారని తెలిపారు. గాడి తప్పినపాలనను తాము తిరిగి గాడిలో పెడుతున్నామన్న చంద్రబాబు తాము ప్రభుత్వపరంగా చేయాల్సిందంతాపేదలకు చేస్తామన్న చంద్రబాబు వారికి అవసరమైన ఇళ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. కానీ వారి కనీస అవసరాలైన విద్యకు సహకారాన్ని అందించాలని కోరారు.
ఉగాది నాడు...
సమాజంలో మార్పు కోసమే పీ4 పథకాన్ని తీసుకు వచ్చామని చంద్రబాబు తెలిపారు. ఉగాది నాడు ఏ కార్యక్రమం తలపెట్టినా అది విజయవంతమవుతుందని , అందుకే ఈ పథకాన్ని నేడు ప్రారంభిచంామని తెలిపారు. పేదరికం లేని సమాజం చూడాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు వివరించారు. తనకు ఏ కోరికలు లేవని, ప్రజలుసంతోషంగా ఉండాలన్నదే తన ధ్యేయమని చంద్రబాబు తెలిపారు. సుపరిపాలనను, మంచి రాజకీయాలు చేయాలని తాను నమ్మి ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. తాను ఇప్పటి వరకూ ఏ తప్పు చేయలేదని, భవిష్యత్ లోనూ ఏ తప్పు చేయనని కూడా అన్నారు. తనకు పనిచేయడం తప్ప మరొకటి తెలియదన్న చంద్రబాబు అందుకే ప్రజలు తనకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారన్నారు.
నలభై ఏళ్లుగా...
నలభై ఏళ్లుగా తాను ప్రజాజీవితంలో ఉన్నానని, తనకు ఆదర్శం ఎన్టీఆర్ అని చంద్రబాబు తెలిపారు. పాతికేళ్ల క్రితం తాను తెచ్చిన ఐటీ విప్లవం కారణంగా ఉపాధి అవకాశాలు పెరిగాయన్న చంద్రబాబు రైతు కూలీలు, పిల్లలు కూడా నేడు విదేశాల్లో ఐటీ ఉద్యోగులుగా ఉండటం తనకు గర్వంగా ఉందని తెలిపారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్లు అగ్రభాగాన ఉండటం గర్వకారణమని అన్నారు. ఇప్పుడు కూడా అదే దూరదృష్టితో తాను ముందుకు వెళుతున్నానని, తన ఆలోచనలకు సహకరించి, పేదలను ఆదుకోవాలని ఆయన సంపన్నులకు సూచించారు. తాను అభివృద్ధి చేసిన తెలంగాణలో నేడు అత్యధికంగా తలసరి ఆదాయం వస్తుందని కూడా చంద్రబాబు అన్నారు. అమరావతి రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని అప్పుడు తన కల నిజమయినట్లేనని ఆయన అన్నారు.