Tirumala : తిరుమలలో తగ్గిన రద్దీ.. సులువుగానే స్వామి వారి దర్శనం
తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం కావడంతో భక్తులు స్వల్ప సంఖ్యలోనే తిరుమలకు వచ్చారు.;
![Tirumala : తిరుమలలో తగ్గిన రద్దీ.. సులువుగానే స్వామి వారి దర్శనం today darsan time in tirumala, wednesday, divotees, hundi income](https://www.telugupost.com/h-upload/2025/01/29/1500x900_1685388-tirumala.webp)
తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం కావడంతో భక్తులు స్వల్ప సంఖ్యలోనే తిరుమలకు వచ్చారు. సోమవారం నుంచి భక్తుల సంఖ్య తిరుమలలో తక్కువగానే ఉంది. దీంతో కంపార్ట్ మెంట్లన్నీ దాదాపు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. అలాగే భక్తులు లేక మాడ వీధులన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. తిరిగి శుక్రవారం నుంచి భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు తక్కువగా రావడంతో అందుకు అనుగుణంగా ప్రసాదాల తయారీని అధికారులు చేస్తున్నారు.
హుండీ ఆదాయం మాత్రం...
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కోసారి తగ్గినా హుండీ ఆదాయం మాత్రం తగ్గదు. తిరుమలకు చేరుకున్న భక్తులు ఖచ్చితంగా హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు మాత్రం తిరుమలకు చేరుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. అలాగే ప్రతి రోజూ ఎస్.ఎస్.డి. టోకెన్లు తిరుపతిలో జారీ చేయడం ప్రారంభించిన తర్వాత దర్శనం సులువుగా అవుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ...
తిరుమలలో ఎప్పటికప్పుడు భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని అందుకు అవసరమైన చర్యలు టీటీడీ అధికారులు తీసుకుంటున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 70,610 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 17,310 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.78 కోట్ల రూపాయలు వచ్చింది. టైమ్ స్లాట్దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.