Karanam Balaram : కరణం బలరాం కధ ముగిసినట్లేనా? ఇక ఫ్యూచర్ లేదా?

సీనియర్ నేత కరణం బలరాం రాజకీయంగా దారి వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.

Update: 2024-09-02 06:50 GMT

ఏదైనా వెయిట్ చేయకుండా రాజకీయాల్లో తొందరపడితే రాజకీయ భవిష‌్యత్ అంధకారం అవుతుంది. మరో ఐదేళ్ల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ సత్యం తెలిసిన సీనియర్ నేతలు కూడా పార్టీ మారడానికి ఉత్సాహం చూపుతున్నారు. కానీ సాధారణ వ్యక్తి కాదు. సీనియర్ నేత. ఈసారి టీడీపీ నుంచి గెలిచి ఉంటే ఖచ్చితంగా మంత్రి పదవిదక్కి ఉండేది. ఆయనే కరణం బలరాం. కరణం బలరాంది సుదీర్ఘ రాజకీయ జీవితం. ఆయన రాజకీయంగా ఎన్నో డక్కామొక్కీలు తిన్నారు. టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగిన కరణం బలరాం ఆ పార్టీ ఓడిపోయినప్పుడు మాత్రం పార్టీని వదిలి వెళ్లిపోయారు.

చాలా రోజుల తర్వాత...
2019 ఎన్నికల్లో చీరాల నుంచి గెలిచిన కరణం బలరాం చాలా రోజుల తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఒకప్పుడు ప్రకాశం జిల్లాను శాసించిన నేత కరణం బలరాం. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో ఒక ఊపు ఊపిన నేత. ఆయన టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రకాశం జిల్లా పార్టీలో ఆయనకంటూ ఒక విలువ ఉంది. ఆయన మాటనుకాదని చంద్రబాబు ముందుకు వెళ్లేవారు కాదు. అలాంటి కరణం బలరాం 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. టీడీపీలో కొనసాగి ఉంటే సరిపోయేది. కానీ కుమారుడు కరణం వెంకటేశ్ భవిష్యత్ కోసం ఆయన టీడీపీ నుంచి గెలిచినా వైసీపీకి మద్దతుదారుగా మారిపోయారు.
వ్యక్తిగత బలంతో...
తాను సెల్ఫ్ గా చీరాలలో గెలిచేటంత బలం ఉందని నమ్మారు. వాస్తవానికి అద్దంకి నియోజకవర్గంలో ఆయన పోటీచేసేవారు. కానీ గొట్టిపాటి కుటుంబం దెబ్బకు ఆయన ఓటమి పాలవుతూ వస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు చీరాలకు పంపారు. అక్కడ గెలిచిన కరణం బలరాం కొన్నాళ్లు టీడీపీ వైపు ఉండి ఆ తర్వాత వైసీీపీ వైపు మొగ్గు చూపారు. తన కుమారుడు వెంకటేశ్ ను జగన్ వద్దకు తీసుకెళ్లిన కరణం బలరాం వైసీపీ కండువాను కప్పేశారు. దీంతో ఆయన టీడీపీకి రాం రాం చెప్పినట్లే అయింది. వైసీపీ లో చేరడంతో తన కుమారుడిని ఎమ్మెల్యేగా చూడాలని భావించిన కరణం బలరాం చీరాల టిక్కెట్ ను కోరి వైసీపీ నుంచి తెచ్చుకున్నారు.
కూటమి గాలిలో
కానీ కూటమి గాలిలో ఓటమి పాలయ్యారు. కరణం వెంకటేశ్ తొలి ప్రయత్నంలో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. కూటమి అధికారంలోకి రావడంతో కరణం బలరాం ఏం చేయలేని స్థితిలోకి వెళ్లారు. వైసీపీలో చేరినా జిల్లాను శాసించే పరిస్థితి లేదు. బాలినేని, వైవీ సుబ్బారెడ్డి లాంటి వాళ్లుండగా కరణం బలరాంకు ప్రయారిటీ వైసీపీ చీఫ్ ఇవ్వరన్నది అందరికీ తెలిసిందే. అదే ఐదేళ్లు ఓపిక పట్టి ఉంటే కరణం బలరాం మరోసారి చీరాల నుంచి గెలిచి మంత్రి అయ్యేవారన్న టాక్ ఆయన అనుచరుల్లో ఉంది. ఆయన కుమారుడు వెంకటేశ్ కూడా ఇప్పుడు వైసీపీలో ఉండలా? తిరిగి టీడీపీలో చేరాలా? అన్న మీమాంసలో ఉన్నట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News