Amaravathi : అమరావతిలో భూముల అమ్మకాలు జరగడం లేదా? అసలు కారణం ఇదేనా?
అమరావతిలో భూముల క్రయ విక్రయాలు జరగడం లేదు. భూములు అమ్మేందుకు రైతులు సుముఖంగా లేరు;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంగా అనుభవమున్న నేత. ఆర్థికంగా స్థిరపడిన లీడర్. ఆయన ప్రస్తుతం కీర్తి కోసం ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ లో ఐటీని అభివృద్ధి చేయడం, హైటెక్ సిటీని ఏర్పాటు చేయడంతో పాటు పలు ప్రతిష్టాత్మకమైన సంస్థలను తేవడానికి చంద్రబాబు కారణమని ఎవరైనా ఒప్పుకోక తప్పదు. అదే ఆయనకు ప్రజల్లో ఒకరకమైన ఇమేజ్ తెచ్చిపెట్టింది. చంద్రబాబు పై ప్రజల్లో భరోసా ఏర్పడింది. హైదరాబాద్ నగరం లా మార్చాలన్న తాపత్రయమే ఇప్పుడు కూడా అమరావతి విషయంలో కనపడుతుంది. అయితే హైదరాబాద్ కు, అమరావతికి మధ్య చాలా తేడా ఉందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
స్థిరపడిన వారు కావడంతో...
అమరావతి ప్రాంతంలో రైతులు ఎవరూ తమ భూములను విక్రయించేందుకు సిద్ధంగా లేరన్నది వాస్తవం. ఎందుకంటే మూడు పంటలు పండే భూములు కావడంతో వారు అప్పటికే జీవితంలో స్థిరపడ్డారు. ఇక్కడి నుంచి ప్రతి రైతు కుటుంబం నుంచి ఒకరు విదేశాల్లో ఉంటున్నారు. ఆర్థికంగా వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. పైగా భూములపై వారికి మక్కువ ఎక్కువ. తాతల నుంచి తమకు సంక్రమించిన భూమిని కోట్ల రూపాయలు వచ్చినా విక్రయించేందుకు సిద్ధంగా లేకపోవడం వల్లనే క్రయవిక్రయాలు జరగడం లేదు. రాష్ట్రమొత్తంగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూముల విలువల ధరలను పెంచిన ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో వారికి మాత్రం మినహాయింపు ఇచ్చింది.
అనాసక్తి కనపర్చడమే...
అయితే ఇక్కడ క్రయ విక్రయాలు జరగకపోవడానికి రైతులు తమ భూములను విక్రయించడానికి సిద్ధంగా లేకపోవడమే. తాము అమ్మి వచ్చిన డబ్బును భద్రపర్చుకోవాలన్నా లేక బ్యాంకుల్లో జమ చేయాలన్నా వారు ఇష్టపడటం లేదు. తమ తర్వాత తరాల వారికి వారసత్వంగా ఇవ్వాలన్న ఏకైక కోరిక వారిని అమ్మకుండా నిరోధిస్తుందని చెబుతున్నారు. అమరావతిలో భూములను కొనుగోలు చేసేందుకు అనేక మంది రియల్టర్లు ప్రయత్నిస్తున్నప్పటికీ ఎక్కువ మంది నిరాశతోనే వెనుదిరిగి వెళుతున్నారని చెబుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం రైతులు భూముల విక్రయానికి అనాసక్తి కనపర్చడమేనని చెబుతున్నారు. రైతులు తమ భూములను అమ్మకుండా అలాగే ఉంచితే ఈ ప్రాంతం ఎలా అభివృద్ధి అవుతుందన్న ప్రశ్న కూడా సహజంగా తలెత్తుంది.
రిజిస్ట్రేషన్లు కూడా...
కొత్త నగరం ఆవిర్భవించాలంటే పాత వాసనలు పోవాల్సిందే. కొత్త నీరు రావాలంటే పాత నీరు పోయిన మాదిరిగానే అక్కడ రూపు రేఖలు మారాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు ప్రయత్నాలకు రైతుల నుంచి పెద్దగా సహకారం అందడం లేదు. అయితే ఇది అమరావతి ప్రాంత రైతుల తప్పు కాదన్న వాదనల్లో కూడా నిజముంది. వారు అంత సులువుగా భూములను విక్రయించేందుకు, డబ్బులకు ఆశపడి అమ్మేందుకు ముందుకు రారు. అందుకే అమరావతి ప్రాంతంలో ఇటీవల కాలంలో రిజిస్ట్రేషన్లు కూడా లేవని చెబుతున్నారు. ఒకసారి అమ్ముడు పోయిన భూములు మాత్రమే తిరిగి అమ్ముడవుతున్నాయి తప్పించి కొత్తగా అమ్మేవారు ఇక్కడ లేకపోవడంతో ప్రభుత్వం కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు. ఎత ధర పలికినా రైతుల అనాసక్తి కనపరుస్తుండటంతో భూముల క్రయవిక్రయాలు తగ్గాయని అంటున్నారు. మరి చంద్రబాబు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.