రుద్దడం సరికాదు...
లీడర్లపై తమ అభిప్రాయాలను రుద్దడం మాత్రం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే.. కేవలం తన ఫొటోతోనే 2019 ఎన్నికల్లో గెలిచారని చెప్పుకున్నా.. నాటి పరిస్థితులు వేరు. అప్పుడు జగన్ పాలనను జనం చూడలేదు. పైగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత కలసి వచ్చింది. అందుకే అన్ని సీట్లు వచ్చాయి. కానీ అదే జగన్ ఫొటో ఈసారి తిరగబడింది. ఎందుకంటే తాను చేసిన తప్పుల వల్లనేనన్నది జగన్ తెలుసుకోవాలి. నాలుగు గోడల మధ్య తీసుకునే నిర్ణయాలు బూమ్‌రాంగ్ అయ్యాయని జగన్ గ్రహించగలగాలి. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే కనీస ప్రయత్నం చేయాలి. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ ఐదేళ్లు పోరాడాలి. అంతే తప్ప మళ్లీ తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీని మళ్లీ అధికారంలోకి తెస్తానని భావించడం కూడా ఒకరకంగా తప్పే అవుతుంది.
లోకల్ లీడర్లకే...
ఎందుకంటే .. స్థానిక నాయకత్వానికి పగ్గాలు అప్పగించాలి. వారికి ఫీల్డ్ లెవెల్లో అసలు సమస్య అనేది తెలుస్తుంది. ఎక్కడికక్కడ ఎదురయ్యే ఇబ్బందులపై పోరాడే శక్తిని వారికి పార్టీ నాయకత్వం ఇవ్వగలగాలి. కేవలం తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తేనే మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తే అది నియంతృత్వ పోకడలకు అద్దం పట్టే విధంగా ఉంటుంది. జగన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయవచ్చు. కానీ తానే అంతా అయి పార్టీని బలోపేతం చేయాలంటే మాత్రం సాధ్యం కాదు. ఇప్పటికే ఓటమితో కుంగిపోయి ఉన్న క్యాడర్ లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలంటే జగన్ మాటలతోనే సాధ్యం కాదు. ఫీల్డ్ లెవెల్లో అక్కడి నేతలు క్యాడర్ కు అండగా ఉండాలి. ఇచ్ఛాపురం నుంచి ఇడుపుల పాయ వరకూ తిరిగినా క్యాడర్ మళ్లీ వస్తారేమో తప్పించి గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం అయ్యేందుకు అవకాశాలు తక్కువ.
నేతలను ఇన్‌వాల్వ్ చేయాలి...
అందుకే ఈసారి జగన్ తన వే ఆఫ్ పార్టీ రన్ ను మార్చుకోవాల్సిందే. జిల్లా అధ్యక్షులకు పూర్తి బాధ్యతలను అప్పగించాల్సి ఉంటుంది. అలాగే స్థానిక నాయకత్వం చెప్పే మాటలను వినాల్సి ఉంటుంది. తనది చిన్న వయసు మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పడం తప్పు కాదు. ధైర్యాన్ని నూరిపోయడంలో ఎవరికీ అభ్యంతరాలుండవు. అలాగే ఈవీఎంల మీద నెపం నెడితే ఉపయోగం ఏమీ ఉండదు. తనతో పాటు నేతలను కూడా కార్యోన్ముఖులను చేయాలంటే అందుకు తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. లీడర్లను ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యులను చేయాల్సి ఉంటుంది. మూడు ప్రాంతాల సమన్వయ కర్తల బాధ్యతలను మార్చాల్సి ఉంటుంది. ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేస్తే తప్ప ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో గెలుపు తలుపు తడుతుంది. లేకుండా అంతా తానే అయినట్లు వ్యవహరిస్తే మాత్రం మరోసారి చేదు అనుభవం చవి చూడక తప్పదు.