Ys Jagan : జగన్ ను వెంటాడుతున్న పదకొండు.. మళ్లీ అదే డేటా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పదకొండు నెంబరు అంటేనే వణుకు పుడుతుంది. షివరింగ్ వస్తుంది.

Update: 2024-11-05 06:16 GMT

ys jagan

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పదకొండు నెంబరు అంటేనే వణుకు పుడుతుంది. షివరింగ్ వస్తుంది. ఆ నెంబర్ కలలో కూడా కనిపించి కలవరానికి గురిచేస్తుంది. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ జగన్ ఊహించని అపజయాన్ని మూటగట్టుకున్నారు. కనీస స్థానాలను కూడా సాధించలేకపోయారు. తాను ఐదేళ్ల పాటు సంక్షేమం కోసం పెట్టిన పెట్టుబడి కూడా వృధాగా మారి చివరకు పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో పదకొండు మీద సోషల్ మీడియాలో అనేక రకాలుగా ట్రోల్స్ జరుగుతున్నాయి. జగన్ ఊహించని అపజయం ఇది. పదకొండు స్థానాలకే పరిమితం కావడంతో చివరకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకుండా పోయింది.

బడ్జెట్ సమావేశాలు...
ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు పదకొండో తేదీన ప్రారంభం కానున్నాయి. పదకొండు తేదీన గవర్నర్ ప్రసంగం ఉంటుంది. వీలుంటే అదే రోజున బడ్జెట్ ను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంతో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ వార్త తెలిసిన తర్వాత జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో? నంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తున్నారు. వైసీపీని ట్రోల్ చేస్తున్నారు. పదకొండు మళ్లీ వచ్చింది బాబాయ్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే మరొక చర్చ కూడా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా జరుగుతుంది. ఈ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారా? లేదా? అన్న చర్చ జరుగుతుంది.
సోషల్ మీడియాలో...
2014లో అరవైకి పైగా స్థానాలు వచ్చినా జగన్ పార్టీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉన్న విషయాన్ని కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈసారి కూడా పదకొండో తేదీన బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయడం వెనక కూడా వైసీపీని అవమానించడానికేనని జగన్ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. అందుకే సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాలకు వస్తారా? రారా? అంటూ సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు వైసీపీ అధినేత జగన్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. పదకొండు పిలుస్తోంది.. రా కదిలిరా అంటూ కామెంట్స్ పెడుతూ కవ్విస్తున్నారు. మరి వైఎస్ జగన్ ఈసారి సమావేశాలకు హాజరవుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News