Ys Jagan : జగనూ.. ఇంకా చేతులు కట్టుకుని కూర్చుంటే ఎలా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంత వరకూ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించలేదు;

Update: 2025-04-15 08:32 GMT
ys jagan, ycp chief, constituency-wise reviews, ap politics
  • whatsapp icon

వైసీపీ అధినేత జగన్ ఇంత వరకూ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించలేదు. జిల్లాల వారీగా నేతలతో సమావేశమై స్థానిక నేతలు పార్టీని వీడకుండా చూసుకుంటున్నారు కానీ, కనీసం తాడేపల్లి కార్యాలయంలోనైనా నియోజకవర్గాల వారీగా నేతలో భేటీ నిర్వహించాలన్న డిమాండ్ వినపడుతుంది. అనేక నియోజకవర్గాల్లో నేతలు ఇంకా బయటకు రావడం లేదు. అనేక నియోజకవర్గాల్లో కార్యకర్తలు నేతల నుంచి సహాకారం, మద్దతు లభించక ఇబ్బందులు పడుతున్నారు. అనేక అక్రమ కేసులు చుట్టుముడుతున్నాయి. అయినా సరే అధికారం కోల్పోయిన తర్వాత స్థానిక మాజీ ఎమ్మెల్యేలు మాత్రం నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు.

జిల్లాకు వచ్చినప్పుడు...
జగన్ జిల్లాకు వచ్చినప్పుడు మాత్రం హడావిడి చేస్తున్న నేతలు తర్వాత కనిపించకుండా పోతున్నారని క్యాడర్ నుంచి వినిపిస్తున్న ఆరోపణ. నేతలను గాడిలో పెట్టేందుకు వైఎస్ జగన్ తాను చేయాల్సిన ప్రయత్నాలు చేయడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన నేతలు అందుబాటులో ఉంటున్నారు. 175 నియోజకవర్గాల్లో దాదాపు వంద నియోజకవర్గాలలో పైగానే క్యాడర్ తో స్థానిక నేతలకు పొసగడం లేదు. ఎవరి దారి వారిదే అయింది. కార్యకర్తలకు గైడెన్స్ కూడా ఇవ్వడం లేదు. అందుకే ప్రధానంగా కార్యకర్తలతో జగన్ సమావేశమయితేనే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుస్తాయంటున్నారు.
చంద్రబాబు ప్రతి నియోజకవర్గానికి వెళ్లి...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పటికీ ఎక్కడకు పర్యటనకు వెళ్లినా తాను వెళ్లిన కార్యక్రమం ముగిసిన తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతుండటాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకునేందుకు చంద్రబాబు అవకాశమిస్తున్నారు కానీ, జగన్ మాత్రం ఆ పని చేయలేకపోతున్నారని అంటున్నారు. జగన్ జిల్లాలకు వేర్వేరు పనుల కోసం వెళుతున్నప్పటికీ, అక్కడ వేలాది మంది కార్యకర్తలు ఆయనను చూసేందుకు వస్తున్నారు. కానీ వారితో సమావేశమై నియోజకవర్గాల పరిస్థితిపై మాత్రం చర్చించేందుకు సుముఖత చూపకపోవడంతో క్యాడర్ లో నేటికీ అసంతృప్తి నెలకొంది.
ఎన్నికల సమయానికి...
ఎన్నికల సమయానికి అందుబాటులోకి వచ్చి టిక్కెట్లు పొంది గెలుపొందడానికి అనేక మంది లీడర్లు ప్రయత్నిస్తున్నారని, ముందు నుంచి జనంలోకి వెళ్లే ప్రయత్నం చేయకుండా పార్టీని కనీసం బలోపేతం చేసే దిశగా కూడా వారు అడుగులు వేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలోనైనా నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలతో సమావేశమై వారి ప్రాంతంలో నెలకొన్న సమస్యలను చర్చించడంతో పాటు నియోజకవర్గంలో నేతల మధ్య నెలకొన్న విభేదాలను కూడా జగన్ పరిష్కరిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెబుతున్నారు. కానీ జగన్ ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడంతో కార్యకర్తలు ఒకరకమైన అసహనంతో ఉన్నారు.


Tags:    

Similar News