Gold Price Today : 90వేలకు చేరుకున్న బంగారం.. వెండి ధరలు కూడా పైపైకి
దేశంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది;

గోల్డ్ రేట్స్ మామూలుగా లేవు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. సీజన్ అని కాకుండా డిమాండ్ తో సంబంధం లేకుండా ధరలు పెరగడం ఇదే ప్రధమమని వ్యాపారులు చెబుతున్నారు. సహజంగా డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు, సీజన్ లో ధరలు పెరగడం మామూలే. కానీ ఈ ఏడాది మొదటి రోజు నుంచి అంటే మూడు నెలల నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమయిన తర్వాత ఇక ధరలను అదుపు చేయడం ఎవరి వల్లా కావడం లేదు. దీంతో బంగారం, వెండి ధరలు భారంగా మారాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి, సామాన్యులకు వీటిని కొనుగోలు చేయడం కష్టంగా మారిందని వ్యాపారులే అంగీకరిస్తున్నారు.
ధరల పెరుగుదలతో...
పెళ్లిళ్ల సీజన్ మరికొన్ని నెలల పాటు నడుస్తుంది. శుభకార్యాలకు ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేయడం దక్షిణ భారత దేశంలో సంప్రదాయంగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయం. అయినా సరే బంగారం ధరల పెరుగుదలను చూసి శుభకార్యాలకు కూడా బంగారం కొనుగోలును తగ్గించుకున్నారు. తమకు అవసరం కంటే మరీ తక్కువగా కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం బంగారం తాకట్టు విషయంలో పెట్టిన నిబంధనలను కూడా కొనుగోళ్లపై ప్రభావం చూపించిందంటున్నారు. బంగారం, వెండి ధరలపై పెట్టుబడి పెట్టే వారితో పాటు కొన్ని వర్గాలు మాత్రమే కొనుగోలుకు సిద్ధమవుతుండటంతో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి.
కొద్దిగా తగ్గినా...
బంగారం అంటే అందరికీ మోజు. కానీ ధరలను చూసి జడుసుకునే పరిస్థితి వచ్చింది. పసిడిని అంత ధరను వెచ్చించి కొనుగోలు చేయడం వృధా అని భావించే రోజులు వచ్చేశాయని చెప్పొచ్చు. ఎందుకంటే అనేక కారణాలతో ఇంకా ధరలు పెరుగుతాయని, త్వరలోనే పది గ్రాముల బంగారం ధర లక్షకు చేరుకుంటుందని చెబుతున్నా ఎవరూ కొనుగోలుకు మొగ్గు చూపడం లేదు. అయితే దేశంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 82,190 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,660 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,11,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.