7 గేదెలను చంపేశాడు.. ఇదంతా పగ అని చెబుతున్న 20 ఏళ్ల యువకుడు

పోలీసులు పలు విషయాలను పరిశీలించారు. అంతేకాకుండా అనుమానితులను కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు.

Update: 2022-05-24 02:31 GMT

సాటి వ్యక్తుల మీద ఉన్న పగ.. వారి మూగ జీవాల మీద చూపిస్తూ ఉంటారు. మే 15న భివాండిలోని డెయిరీ ఫామ్‌లో పదునైన ఆయుధాలతో ఏడు గేదెలను చంపి, మరో ఐదు గేదెలను తీవ్రంగా గాయపరిచినందుకు 20 సంవత్సరాల యువకుడిని థానేలోని భివాండి నిజాంపూర్ పోలీసులు అరెస్టు చేశారు.

మే 15న, భివాండిలోని పాత వంతెన సమీపంలో అర్హమ్ మోమిన్ నడుపుతున్న డెయిరీ ఫామ్‌లో సుమారు 20 గేదెలను కట్టి ఉంచారు. తెల్లవారుజామున డెయిరీ ఫారం కార్మికులు అక్కడికి చేరుకోగా రక్తపు మడుగులో ఏడు గేదెలు పడి ఉన్నాయి. అంతేకాకుండా మరో ఐదు తీవ్రంగా గాయపడ్డాయి. గుర్తు తెలియని వ్యక్తులు సరిహద్దు గోడపై నుంచి పొలం లోపలికి దూకి పదునైన ఆయుధాలతో గేదెలపై దాడి చేసి ఉంటారని అనుమానించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, కేసు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు పలు విషయాలను పరిశీలించారు. అంతేకాకుండా అనుమానితులను కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు. వివరణాత్మక దర్యాప్తులో భాగంగా డెయిరీ ఫామ్ యజమాని అర్హమ్ మోమిన్‌ స్నేహితుడు ఫాజిల్ హుస్సేన్ ఖురేషీని కూడా విచారణకు పిలిపించారు. ఫాజిల్ హుస్సేన్ ఖురేషీ మాటల్లో తేడా ఉండడంతో.. అధికారులు అతడిని ప్రత్యేకంగా విచారించడం మొదలుపెట్టారు.
గత కొన్ని రోజులుగా మోమిన్ తన గురించి నెగటివ్ గా మాట్లాడుతున్నాడని ఖురేషీ విచారణలో బయట పెట్టాడు. అర్హమ్ మోమిన్ చేసిన వ్యాఖ్యలతో కలత చెందిన ఖురేషీ, అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని.. అతనికి గుణపాఠం చెప్పాలని అనుకున్నాడు. అంతేకాకుండా అర్హమ్ మోమిన్ ను ఆర్థికంగా దెబ్బతీయాలని అనుకున్నాడు. గేదెలపై పదునైన ఆయుధంతో దాడి చేసి ఏడు గేదెలను చంపేశాడు.. మిగతా ఐదు గేదెలకు తీవ్ర గాయాలు అయ్యేలా చేశాడు. ఈ కేసులో ఖురేషీని పోలీసులు అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News