బాలికపై ప్రియుడి దాడి.. తలలో కత్తి ఇరుక్కున్నా వదలకుండా..
తన స్నేహితుడి కొడుకు పుట్టినరోజు ఫంక్షన్ కు వెళ్తున్న నిక్కీని మాట్లాడాలని పిలిచి.. కత్తితో 21 సార్లు పొడిచాడు.
దేశరాజధాని ఢిల్లీలో క్రైం రేటు పెరుగుతోంది. ప్రతిరోజూ ఏదొక దారుణ ఘటన జరుగుతూనే ఉంది. శ్రద్ధావాకర్ హత్యోదంతం తర్వాత.. తరచూ అలాంటి ఘటనలే జరుగుతున్నాయి. తాజాగా బాలికపై ప్రియుడు దాడి చేసి.. ఆమెను కత్తితో 21 సార్లు పొడిచి చంపిన ఘటన గగుర్పాటుకు గురిచేస్తోంది. అటుగా వెళ్తున్న వారు కూడా ఈ దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఆదివారం రాత్రి ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ఏరియాలోని రోహిణిలో ఈ దారుణ ఘటన జరిగింది. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు..
20 ఏళ్ల సాహిల్.. 16 ఏళ్ల నిక్కీ రిలోషన్ షిప్ లో ఉన్నారు. శనివారం వీరిద్దరికీ గొడవ జరిగింది. ఆదివారం మరోసారి గొడవ జరగడంతో నిగ్రహం కోల్పోయిన సాహిల్.. నిక్కీపై కత్తితో దాడి చేశాడు. తన స్నేహితుడి కొడుకు పుట్టినరోజు ఫంక్షన్ కు వెళ్తున్న నిక్కీని మాట్లాడాలని పిలిచి.. కత్తితో 21 సార్లు పొడిచాడు. ఆమె తలలో కత్తి ఇరుక్కుపోయినా ఆగకుండా.. బండరాయితో ఐదుసార్లు మోది మరీ అత్యంత దారుణంగా హతమార్చాడు. అనంతరం ఆమె ఫోన్ నుండి వారిద్దరి వాట్సాప్ చాట్, మెసేజ్ లను తొలగించాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల్ని పరిశీలించి నిందితుడిని సాహిల్ గా గుర్తించారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సాహిల్ ను పోలీసులు బృందాలు అరెస్ట్ చేశాయి.
ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాలి స్పందించారు. ఢిల్లీలో మైనర్ బాలికను బహిరంగంగా హత్య చేయడంపై ఆయన దిగ్భ్రాంతి చెందారు. నేరస్తులు నిర్భయంగా ఉన్నారని, పోలీసులంటే కనీస భయం కూడా లేదని.. లా అండ్ ఆర్డర్ చేతిలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ సార్ .. మీరే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాలి మాట్లాడుతూ..ఢిల్లీలో బాలికలు, మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. 16 ఏళ్ల బాలికపై 40-50 సార్లు కత్తితో పొడిచారని, ఆపై బండరాయితో అనేక మార్లు కొట్టి చంపారన్నారు. నేరస్తులను కట్టడి చేసేందుకు పోలీసులు ఎన్నికఠిన చర్యలు తీసుకున్నా భయపడటం లేదన్నారు.