తెలంగాణలో దారుణం.. శవాన్ని కొరుక్కు తిన్న ఎలుకలు
ఆదివారం నాడు పెరికల రవి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని ఆస్పత్రికి
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో దారుణం చోటు చేసుకుంది. భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి లో ఎలుకలు మార్చురి లోని శవాన్ని కొరికి తిన్నాయి. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ఆసుపత్రి యాజమాన్యం ప్రయత్నాలు చేసింది కానీ.. అవి ఫలించలేదు. మృతదేహాన్ని ఎలుకలు కొరకడాన్ని స్థానికులు ఫొటో తీయడంతో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో బయటకు వచ్చింది. మృతదేహాన్నీ గంటల కొద్దీ వదిలేసి వెళ్లిపోవడం.. ఆస్పత్రిలో భారీగా ఎలుకల సమస్యలు ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఆదివారం నాడు పెరికల రవి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. అయితే మృతదేహాన్ని ఎలుకలు కొరికేశాయి. దీనిని కొంతమంది గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబసభ్యులు వచ్చి చూడగా ముఖం, చెంపలు, నుదుటి భాగంలో ఎలుకలు కొరికినట్లు గుర్తించారు. సిబ్బంది పట్టించుకోకుండా గుట్టుచప్పుడు కాకుండా పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రయత్నం చేశారు. వైద్యుల తీరుపై కుటుంబసభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పెరికెల రవి కుమార్(35) భువనగిరి పట్టణంలో నివసిస్తున్నాడు. భువనగిరి ప్రగతినగర్‌లో తన పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. మద్యానికి బానిసైన రవి కుమార్ ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోలీసులు మార్చురీకి తరలించారు. మృతదేహాన్ని ఫ్రీజర్‌లో భద్రపర్చాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా గదిలోనే ఉంచారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ చిన్ననాయక్‌ను వివరణ కోరగా.. మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలోనే ముఖంపై గాట్లున్నాయని, ఫ్రీజర్‌లోనే సిబ్బంది భద్రపరిచారని తెలిపారు. భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్ సుధీర్‌కృష్ణ మాత్రం రవిశంకర్ మృతదేహాన్ని మార్చురీకి తరలించిన సమయంలో ఎలాంటి గాయాలు, గాట్లు లేవని చెప్పారు.