యూపీలో దారుణం.. 10 ఏళ్ల బాలుడి నరబలి

అతనికి వివేక్ వర్మ అనే 10 ఏళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు. అదే గ్రామంలో కృష్ణకు అనూప్ అనే ఓ బంధువు ఉన్నాడు.;

Update: 2023-03-27 06:49 GMT
uttarpradesh crime news, human sacrifice

uttarpradesh crime news

  • whatsapp icon

ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన జరిగింది. 10 ఏళ్ల బాలుడిని నరబలి చేయడం స్థానికంగా కలకలం రేపింది. మూఢనమ్మకాలతో, తాంత్రికుడి మాటలు విని సమీప బంధువే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. బహ్రైచ్ జిల్లా పర్సా గ్రామానికి చెందిన కృష్ణ వర్మ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అతనికి వివేక్ వర్మ అనే 10 ఏళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు. అదే గ్రామంలో కృష్ణకు అనూప్ అనే ఓ బంధువు ఉన్నాడు. అతనికి పెళ్లై రెండున్నరేళ్ల కొడుకు ఉన్నాడు. అనూప్ కొడుక్కి కొంతకాలంగా అనారోగ్యం వేధిస్తోంది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న అతనికి వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది.

ఈ క్రమంలో అనూప్ ఓ తాంత్రికుడిని కలిశాడు. అతను అనూప్ కు.. ఓ బాలుడిని నరబలి ఇస్తే అంతా బాగుంటుందని చెప్పాడు. మంత్రగాడి మాటల్ని గుడ్డిగా నమ్మిన అనూప్.. తనకు వరుసకు మేనమామ అయిన చింతారామ్ తో కలిసి గురువారం(మార్చి 23) రాత్రి కృష్ణవర్మ కొడుకు వివేక్ వర్మను ఎత్తుకెళ్లారు. తన కొడుకు కనిపించడం లేదంటూ కృష్ణవర్మ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సమీపంలోని పొలాల్లో వివేక్ వర్మ మృతదేహం లభించింది.
హత్యకేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. వివేక్ వర్మను నరబలి ఇచ్చినట్లు తేలింది. తాంత్రికుడి మాటలు విని అనూప్.. తన మేనమామ చింతారామ్ సహాయంతో వివేక్ ను హతమార్చినట్లు వెల్లడైంది. దాంతో అనూప్, చింతారామ్, తాంత్రికుడిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ చేశారు.


Tags:    

Similar News