యధేచ్ఛగా డ్రగ్స్ దందా.. పోలీసులకు చిక్కిన విద్యార్థి
సమాచారం అందుకున్న పోలీసులు మఫ్టీలో కాపు కాసి నిందితుడు, అతని వద్ద ఉన్న హెరాయిన్ ను
రంగారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని నార్సింగిలో డ్రగ్స్ తీసుకుంటుండగా ఓ విద్యార్థిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని నుంచి 5 గ్రాముల డ్రగ్స్, 14 ఇన్సులిన్ సిరెంజస్, ఓ వెయింగ్ మిషన్ తో పాటు 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరానికి చెందిన సాకేత్ గా పోలీసులు గుర్తించారు. సాకేత్ బెంగళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసి, వాటిని రాజేంద్రనగర్ ప్రాంతంలో విక్రయించడానికి వచ్చాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాకేత్ డ్రగ్స్ ఎవరికి విక్రయించడానికి వచ్చాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
అంతకు ముందు రోజ ముంబై లో డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తీసుకువచ్చి టోలిచౌకిలో అమ్ముతున్న వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మఫ్టీలో కాపు కాసి నిందితుడు, అతని వద్ద ఉన్న హెరాయిన్ ను పట్టుకొని సీజ్ చేశారు. టోలిచౌకికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ ప్రైవేటు ఉద్యోగ చేస్తూ హెరాయిన్ విక్రయిస్తున్నాడు. ఈ నెల 21న టోలిచౌకి ప్రాంతంలో అమ్ముతున్నట్టు ఎస్ఐ గణేష్ గౌడ్‌కు సమాచారం అందింది. ఎస్ఐ మఫ్టీలో ఇర్ఫాన్ వద్దకు వెళ్లి హెరాయిన్ కావాలని అడగ్గా.. ఒక హెరాయిన్ ప్యాకెట్ ఎస్ఐ చేతిలో పెట్టాడు. ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద 8.56 గ్రాముల హెరాయిన్ దొరికింది. ముంబాయికి చెందిన గయాజ్ నుంచి కొనుగోలు చేసినట్లు ఇర్ఫాన్ తెలిపాడు. ఇర్ఫాన్, గయాజ్లపై నార్కోటిక్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గయాజ్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.