షవర్మా తిని ఒకరు మృతి.. 18 మంది ఆస్పత్రిలో..
తాజాగా ఓ షాపులో షవర్మా తిని ఒకరు మృతి చెందగా.. మరో 18 మంది ఆస్పత్రి పాలైన ఘటన కేరళలోని కాసరగోడ్ జిల్లాలో చోటుచేసుకుంది.
కాసరగోడ్ : రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుందని అందరూ అనుకుంటారు. వీకెండ్ వస్తే చాలు.. రెస్టారెంట్లు, హెటల్స్ కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. కానీ.. అక్కడ ఫుడ్ ను ఫ్రష్ గా వండి వడ్డించరన్న సంగతి చాలా తక్కువమందికే తెలుసు. ముందురోజు మిగిలిపోయిన ఫుడ్ ను ఫ్రిడ్జ్ లో పెట్టి.. మర్నాడు మళ్లీ దానిని వేడి చేసి కస్టమర్లకు వడ్డించేస్తుంటారు. లేదా వేరే పద్ధతిలో నిల్వచేసి.. దానినే అమ్ముతున్నారు. ఫలితంగా వినియోగదారులకు ఫుడ్ పాయిజన్ అయి ఆస్పత్రి పాలవుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు ఎన్నిసార్లు హోటళ్లపై రైడ్ చేసినా.. వారి పద్ధతిలో మాత్రం మార్పు రావడం లేదు.
తాజాగా ఓ షాపులో షవర్మా తిని ఒకరు మృతి చెందగా.. మరో 18 మంది ఆస్పత్రి పాలైన ఘటన కేరళలోని కాసరగోడ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ ట్యూషన్ కు దగ్గర్లో ఉన్న జ్యూస్ షాప్ లో షవర్మా కూడా అమ్ముతుంటారు. ట్యూషన్ కి వచ్చే పిల్లలు అక్కడ షవర్మా తినడానికి అలవాటు పడ్డారు. అలవాటు ప్రకారం ఆదివారం కూడా కొంతమంది విద్యార్థులు ఆ జ్యూస్ షాపు వద్ద షవర్మా తిన్నారు. కొద్దిసేపటికే వారంతా అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల్లో 16 ఏళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మరో 18 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో.. అధికారులు జ్యూస్ షాప్ పై కేసు నమోదు చేసి సీజ్ చేశారు.