కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం : 237 మంది మృతి
ప్రయాణికుల హాహాకారాలతో, కుప్పలుగా ఉన్న మృతదేహాలతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్..
పశ్చిమబెంగాల్ లోని హౌరా నుంచి చెన్నైకు వెళ్తోన్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ శుక్రవారం రాత్రి 7.15 గంటలకు ఘోర ప్రమాదానికి గురైంది. ఒడిశాలోని బాలాసోర్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో గూడ్స్ రైలును ఢీ కొట్టింది. ఆ తర్వాత 3 స్లీపర్ కోచ్ లను వదిలి మిగతా కోచ్ లన్నీ పట్టాలు తప్పాయి. మొత్తం 18 కోచ్ లు ఉండగా 15 కోచ్ లు పట్టాలు తప్పాయి. పట్టాలు తప్పిన భోగీలను యశ్వంత్ పూర్ - హౌరా ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకూ మొత్తం 237 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 900 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను భువనేశ్వర్ లోని ఆసుపత్రులకు తరలించారు. భువనేశ్వర్ తో పాటు ఐదు నగరాల్లోని ప్రధాన ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం మృత్యులోకాన్ని తలపిస్తుంది. ప్రయాణికుల హాహాకారాలతో, కుప్పలుగా ఉన్న మృతదేహాలతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున కేంద్రం పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున అందించనుంది. ఈ ప్రమాదంపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేడు సంతాప దినంగా ప్రకటించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. సహాయక చర్యలు అందించేందుకు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా రంగంలోకి దిగింది.
ప్రమాదంలో గాయపడిన వారి వివరాలను అందించేందుకు అధికారులు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. ఐదు రాష్ట్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగాల్, కర్ణాటకల్లో హెల్ప్ లైన్స్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. ఒడిషా ప్రభుత్వం: 06782-262286, హౌరా: 033-26382217, ఖరగ్‌పూర్: 8972073925, బాలేశ్వర్: 8249591559, చెన్నై: 044-25330952, విశాఖ: 08912 746330, 08912 744619, విజయనగరం: 08922-221202, 08922-221206, విజయవాడ: 0866 2576924, రాజమండ్రి: 0883 2420541, రేణిగుంట: 9949198414, సికింద్రాబాద్: 040 27788516, తిరుపతి: 7815915571, నెల్లూరు: 08612342028 నంబర్లను ఏర్పాటు చేశారు.