విషాదం.. అగ్నిప్రమాదంలో కుటుంబం సజీవదహనం
ప్రమాద సమయంలో కుటుంబ పెద్ద రామశంకర్ రాజ్ భర్ ఆరుబయట నిద్రిస్తున్నాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచార మిచ్చి..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో నలుగురు 14 ఏళ్లలోపు పిల్లలే కావడం.. అందరి హృదయాలను ద్రవిస్తోంది. మౌ జిల్లా కోపగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. షాపూర్ గ్రామంలో ఓ కుటుంబం నివాసముంటోంది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో.. వంట చేస్తున్న క్రమంలో స్టవ్ నుండి ఒక్కసారిగా మంటలు ఎగసిపడి ఇంటికి అంటుకున్నాయి.
ప్రమాద సమయంలో కుటుంబ పెద్ద రామశంకర్ రాజ్ భర్ ఆరుబయట నిద్రిస్తున్నాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచార మిచ్చి.. చుట్టుపక్కల వారి సహాయంతో మంటలను ఆర్పేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి మంటలు పెరిగిపోవడంతో.. ఐదుగురు కుటుంబ సభ్యులు సజీవదహనమయ్యారు. మంటలను అదుపు చేసి లోపలికి వెళ్లి చూసేసరికి ఒక మహిళ, నలుగురు పిల్లలు విగజీవులై కనిపించారు. మృతుల్లో మహిళతోపాటు 14, 10, 12, 6 సంవత్సరాల వయస్సు గల నలుగురు పిల్లలున్నట్లు గుర్తించారు. మృతులకు రూ.4లక్షల చొప్పున పరిహారం అందిస్తామని జిల్లా మెజిస్ట్రేట్ అనికుమార్ తెలిపారు.