Lunar Eclipse : ఈ సమయంలో ఆహారం తీసుకోకండి.. పూజలు చేయద్దు.. తులసి మొక్కను తాకొద్దు

చంద్రగ్రహణం రోజు.. పూర్తిగా ఉపవాసం ఉండి, గ్రహణం వీడాక విడుపు స్నానం చేసి ఆహారం వండుకుని భోజనం చేయాలన్నది ఆనవాయితీ.;

Update: 2022-11-08 04:16 GMT

lunar eclipse 2022

నేడు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజులకే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత్ లో మాత్రం ఇది పాక్షికంగా ఉంటుంది. మళ్లీ మూడేళ్ల తర్వాత.. అంటే 2025లో మార్చి 14న సంపూర్ణ చంద్రగ్రహణం రానుంది. నేడు ఏర్పడే చంద్రగ్రహణం మేషరాశిలో ఏర్పడనుందని ఇప్పటికే పండితులు తెలిపారు. కాగా.. చంద్రగ్రహణానికి 9 గంటల ముందే సూతకాలం మొదలవుతుంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదని, ఏమీ తినకూడదని చెప్తుంటారు.

చంద్రగ్రహణం రోజు.. పూర్తిగా ఉపవాసం ఉండి, గ్రహణం వీడాక విడుపు స్నానం చేసి ఆహారం వండుకుని భోజనం చేయాలన్నది ఆనవాయితీ. కానీ.. అలా ఉండలేనివారు, గర్భిణులు ఉదయం 10.30 గంటల్లోపు ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.30 కొనసాగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.32 గంటలకు కనిపిస్తుంది. సాయంత్రం 6.18 గంటలకు ముగుస్తుంది. మధ్యాహ్నం 2.39 గంటల నుండి సాయంత్రం 6.30 వరకూ అన్నపానీయాలు తీసుకోకపోవడం మంచిది. అలాగే ఆ సమయంలో కత్తులు, కత్తెరలు, చాకులు ఉపయోగించకుండా ఉండేలా చూసుకోవాలి. గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవడం అంతమంచిది కాదని పండితులు చెబుతున్నారు. అలాగే సూతకాలంలో పూజలు చేయకూడదు. అలాగే సూతకాలం మొదలు.. గ్రహణం విడిచే వరకూ తులసి మొక్కను తాకరాదు.
గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేయాలి. ఎలాంటి పనులు చేయకుండా దైవ ధ్యానం చేయడం మంచిది. అనవసరంగా ఇతరులను దూషించడం, కొట్టడం మంచిది కాదు. వీలైనంతవరకూ మౌనం పాటించడం ఉత్తమం. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని పండితుల సూచన. కార్తీకమాస పూజలు చేసేవారు గ్రహణం వీడాక.. అంటే సాయంత్రం 6.30 తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని, పూజా సామాన్లను శుభ్రం చేసుకోవాలి. విడుపు స్నానం చేసిన తర్వాత పూజ చేయాలి.


Tags:    

Similar News