ఫ్యాక్ట్ చెక్: ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన 'హబ్ పవర్' కంపెనీ పాకిస్థాన్ ఆధారిత సంస్థ కాదు
‘హబ్ పవర్ కంపెనీ’ అనే పాకిస్థాన్‌కు చెందిన కంపెనీ నుంచి బీజేపీకి విరాళాలు అందాయని
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలకు సంబంధించిన సమాచారాన్ని భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే 'హబ్ పవర్ కంపెనీ' అనే పాకిస్థాన్ ఆధారిత సంస్థ నుంచి బీజేపీకి విరాళాలు అందాయని సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయింది. దానితో పాటుగా ఉన్న స్క్రీన్‌షాట్ వైరల్ అవుతూ ఉండడాన్ని గమనించవచ్చు.
భారతీయ ఎన్నికల సంఘం (ECI) ఎలక్టోరల్ బాండ్‌లకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది. ఈసీఐకి బాండ్-సంబంధిత డేటా మొత్తాన్ని సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం కోర్టు ఆదేశాలను జారీ చేసింది. 2019లో పుల్వామా దాడి జరిగిన కొన్ని నెలల తర్వాత 'హబ్ పవర్ కంపెనీ' ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిందని కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌లో భాగంగా బాండ్‌లను దేశంలో రిజిస్టర్ చేసిన సంస్థలు, భారత పౌరులు కొనుగోలు చేయవచ్చు. ఒక విదేశీ కంపెనీ భారతదేశంలో రిజిస్టర్ చేసుకున్నాక, దాని అనుబంధ సంస్థల ద్వారా ఎలక్టోరల్ బాండ్ లను కొనుగోలు చేయవచ్చు.
https://www.facebook.com/reel/1132255107771763
ఫ్యాక్ట్ చెకింగ్:
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పోర్టల్‌లో 'హబ్ పవర్ కంపెనీ' అనే సంస్థ గురించి మాకు ఎలాంటి సమాచారం దొరకలేదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్నట్లుగా కంపెనీ నిజంగా పాకిస్తానీ సంస్థకు అనుబంధ సంస్థ అయితే.. ఆ వివరాలను మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో యాక్సెస్ చేయవచ్చు. మేము అందుకోసం వెతకగా.. మాకు ఎలాంటి వివరాలు లభించలేదు.
మేము కంపెనీ పేరును ఉపయోగించి IndiaMartని సెర్చ్ చేశాం. మేము ఆ కంపెనీ GST నంబర్‌ను పొందాము. GST వెబ్‌సైట్‌లో మరింత వెతకగా.. అదే పేరుతో ఉన్న కంపెనీకి సంబంధించిన వివరాలు మాకు లభించాయి.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. 2018లో రిజిస్టర్ చేసిన ఢిల్లీకి చెందిన కంపెనీ. 'రవి మెహ్రా' పేరుతో నమోదైన సంస్థ. ఈ వివరాల కారణంగా విదేశీ కంపెనీకి అనుబంధ సంస్థ కాదని మనకు తెలుస్తుంది.
'హబ్ పవర్ కంపెనీ లిమిటెడ్ (HUBCO)' అని పిలిచే పవర్ ప్రొడక్షన్ కంపెనీ పాకిస్తాన్‌లో ఉంది. వైరల్ పోస్ట్‌లో షేర్ చేసిన లోగో ఈ కంపెనీకి సంబంధించినది. అయితే, భారతదేశంలో ఉన్న కంపెనీతో ఈ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు.
పాకిస్థాన్‌కు చెందిన కంపెనీని ఎలక్టోరల్ బాండ్‌లతో అనుసంధానం చేస్తూ ప్రచారంలో ఉన్న వార్తలకు ప్రతిస్పందనగా కంపెనీ ఒక వివరణను జారీ చేసింది. తమ ప్రకటనలో.. ఈ విషయంతో లేదా భారతదేశంలోని ఏ కంపెనీతోనూ తమకు ఎలాంటి సంబంధం లేదని కంపెనీ వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. భారతీయ జనతా పార్టీకి సహకారం అందించిన 'హబ్ పవర్ కంపెనీ' ఢిల్లీలో రిజిస్టర్ అయింది. అంతేకానీ ఏ పాకిస్తానీ కంపెనీతో అనుబంధ సంస్థగా ఇక్కడ కార్యకలాపాలను నిర్వహించడం లేదు.
Claim : Details of electoral bond buyers revealed that the BJP received donations from a Pakistan-based company called ‘Hub Power Company’
Claimed By : Social media users
Fact Check : False