Holi 2023 : హోలీని ఎందుకు జరుపుకుంటారు ? దాని వెనుక ఉన్న పురాణ కథ ఇదే..
విష్ణు భక్తుడు ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపుడు. అతను రాక్షస జాతికి రారాజు. చాలా కాలం తపస్సు చేసి, తనను చంపడం ఇతరులకు..
హోలీ.. ఇది అనేక రంగుల కలయికతో జరుపుకునే పండుగ. వసంతకాలంలో వచ్చే ఈ పండుగను యావత్ భారత్ అంతా జరుపుకుంటుంది. నేపాల్, బంగ్లాదేశ్ లలో ఉన్న ప్రవాస భారతీయులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. భారత్ లో ముఖ్యంగా.. మథుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజులు పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి. హోలికా దహనం, కాముడి దహనం వంటి కార్యక్రమాలూ నిర్వహిస్తారు. అయితే ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హోలీ వెనుక ఓ పురాణ కథ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విష్ణు భక్తుడు ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపుడు. అతను రాక్షస జాతికి రారాజు. చాలా కాలం తపస్సు చేసి, తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. ఇతడిని "పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు, శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందుతాడు. ఇక తనను చంపేవాడు పుట్టడని, తనకు చావే లేదని విర్రవీగుతూ.. ఇహ, పర లోకాలపై దాడులు చేస్తాడు. దైవారాధన మాని, తననే పూజించాలని శాసిస్తాడు. అంతటి రాక్షసుడి కడుపున ప్రహ్లాదుడు పుడతాడు.
పుట్టుకతోనే అతను విష్ణు భక్తుడు. నిత్యం విష్ణువుని ఆరాధిస్తుంటే.. హిరణ్య కశ్యపుడు చూసి ఓర్వలేకపోతాడు. దైవారాధన మానివేయాలని కుమారుడిని పలుమార్లు హెచ్చరించినా.. ప్రహ్లాదుడు వినడు. ఆఖరికి కొడుకుని చంపాలని నిర్ణయిస్తాడు. రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారుతుంది. ఎత్తైన కొండలపై నుంచి పడేసినా ఏమీ కాదు. ఏనుగులచే తొక్కించినా చీమంత గాయం కూడా అవ్వదు. ఎందుకంటే ప్రహ్లాదుడు విష్ణువుని స్మరిస్తూ ఉంటాడు. ఇక ఆఖరికి తన సోదరి అయిన హోలికాకు మంటల్లో కాలని శాలువా ఒకటి ఇచ్చి.. అగ్నిపో కూర్చోపెడతాడు. ప్రహ్లాదుడిని ఆమె ఒడిలో కూర్చోవాలని ఆజ్ఞాపిస్తాడు.
ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎలాంటి హాని జరగదు. అలా హోలిక అనే రాక్షసి మంటలకు ఆహుతై మరణించిన రోజునే హోలీ పండుగను జరుపుకుంటున్నాం. అదే రోజున హోలికా దహన్ పేరిట..ఓ దిష్టిబొమ్మను దహనం చేసే కార్యక్రమాన్నీ నిర్వహిస్తారు. ఇక హోలికా మరణం తర్వాత హిరణ్యకశ్యపుడిని విష్ణుమూర్తి ఏ అవతారంలో వధించాడో తెలిసిందే.