ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో బంకించంద్ర ఛటర్జీ అగ్రగణ్యుడు. ఒక్క బెంగలీ సాహిత్యాన్నే కాకుండా.. భారతీయ సాహిత్యాలను ఆయన ఒక శతాబ్దం పాటు ప్రభావితం చేశారు. ఒక మహా కవి రచించిన దేశభక్తి గీతం ప్రజలను ఉత్తేజపరిచి, ఉద్యమింపచేసిన సంఘటన భారత దేశ స్వతత్ర్యోద్యమంలో తప్ప మరో చోట ఎక్కడా సంభవించలేదు. భారతదేశ స్వతత్ర్యోద్యమం ఒక నిర్ణాయక ఫలసిద్ధి దిశగా చైతన్యవంతమవుతున్నప్పుడు వందేమాతరం గీతం వేగాన్ని మరింత పెంచింది. ఆయన సృష్టించిన పాత్రలు కాల్పనిక సాహిత్యానికి చెందినవే అయినా.. సృజనాత్మక సంవేదనలలో ఆయనకాయనే సాటి అని ఆ సాహిత్య విమర్శకుల అభిప్రాయం. నవలలు, వ్యాసరచన, సాహిత్య విమర్శ, వ్యాఖ్యానరచనలో బంకించంద్రఛటర్జీ సాహిత్యంలో కొత్త వరవడి సృష్టించాడు.
సంప్రదాయ, సంపన్న బెంగాలీ కుటుంబంలో 1838 జూ 27న జన్మించిన బంకిమ్ చంద్ర మొదటి బంగాలీ రచన 'దుర్గేష్‌నందిని' దుర్గేష్‌నందిని ఒక నవల. కానీ తర్వాత మెల్లగా తన అసలు ప్రతిభ కవిత్వంలోనే ఉందనే విషయం ఆయనకు అర్థమైంది. దాంతో ఆయన కవితలు రాయడం ప్రారంభించారు. ఎన్నో ప్రముఖ సాహిత్య రచనలు అందించిన బంకిమ్ విద్యాభ్యాసం హుగ్లీ కాలేజ్, ప్రెసిడెన్సీ కాలేజ్‌లో సాగింది.
బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ ఆనంద్‌మఠ్ రచించారు. తర్వాత దానికి వందేమాతరం గీతాన్ని కలిపారు. అది అలా చూస్తూ చూస్తూనే దేశవ్యాప్తంగా జాతీయవాదానికి ప్రతీకగా మారిపోయింది. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ దీనికి బాణీని సిద్ధం చేశారు. వందేమాతరంకు జనాదరణ ఎంతో వేగంగా పెరుగుతూ వచ్చింది. 1894 ఏప్రిల్లో బంకిమ్ చంద్ర మరణించారు. తర్వాత 12 ఏళ్లకు విప్లవకారుడు బిపిన్ చంద్రపాల్ ఒక రాజకీయ పత్రిక ప్రచురించడం ప్రారంభించారు. దానికి ఆయన వందేమాతరం అనే పేరు పెట్టారు. లాలా లాజ్‌పత్ రాయ్ కూడా అదే పేరుతో ఒక జాతీయవాద పత్రికను ప్రచురించారు.
ఇక స్వతంత్ర భారతదేశం కోసం కొత్త రాజ్యాంగం రాస్తున్నప్పుడు వందేమాతరంను జాతీయగేయంగా స్వీకరించలేదు, దానికి జాతీయగీతం హోదా కూడా దక్కలేదు. కానీ రాజ్యాంగబద్ధంగా సభ అధ్యక్షుడు, భారత తొలి రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ 1950, జనవరి 24న వందేమాతరం గీతానికి జాతీయ గేయం హోదా ఇస్తున్నట్టు ప్రకటించారు.
బంకిమ్ చంద్ర వందేమాతరం గీతాన్ని 1870 దశకంలో రచించారు. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ వందేమాతరం గీతాన్ని స్వతంత్ర భారత దేశం జాతీయ గేయంగా స్వీకరించడానికి వెనకాడారు. దేశానికి దేవుడి రూపం ఇవ్వడాన్ని, దానిని పూజించమని చెప్పడాన్ని వ్యతిరేకించే ముస్లింలీగ్, ముస్లింలు కూడా వందేమాతరంను వ్యతిరేకించారు. స్వయంగా వెళ్లి రవీంద్రనాథ్ ఠాగూర్‌ను కలిసిన నెహ్రూ వందేమాతరం గీతాన్ని స్వాతంత్రోద్యమం మంత్రంగా చేయడానికి ఆయన అభిప్రాయం కోరారు. బంకిమ్ చంద్ర కవితలను, ఆయన దేశభక్తిని రవీంద్రనాథ్ ఠాగూర్ అభిమానించేవారు. వందేమాతరంలోని మొదటి రెండు శ్లోకాలను బహిరంగంగా పాడవచ్చని నెహ్రూకు ఆయన చెప్పారు. ఆ తర్వాత అందరూ వందేమాతరంలో స్వాతంత్ర్య కాంక్షను చూశారు కానీ.. మతం కోణం చూడలేదు. దీంతో వందేమాతరం దేశం మొత్తం వ్యాపించింది. భారతీయులలో స్వాతంత్ర్య కాంక్ష రగిల్చింది.