రాబోయే పదేళ్లలో వైద్య రంగంలో అనూహ్య మార్పులు

దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బయ్‌ ఆరేళ్లు నిండుతున్నాయ్‌.

Update: 2023-08-09 04:39 GMT

రాబోయే పదేళ్లలో వైద్య రంగంలో అనూహ్య మార్పులు

ఆధునిక, సాంకేతిక పరిజ్నానంతో సులువైన వైద్యం

దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బయ్‌ ఆరేళ్లు నిండుతున్నాయ్‌. ఆధునిక శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం ఎంతో పురోగమించింది. మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు వడివడిగా పరుగులు తీస్తోంది. వైద్య రంగం కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. గ్రామీణ ప్రాంతాలకు పూర్తి స్థాయి నాణ్యమైన వైద్యం దొరకడం లేదు కానీ, టైర్‌`2, 3 సిటీల్లో మాత్రం ఆధునిక వైద్యం అందుబాటులో ఉంటోంది. క్యాన్సర్‌ లాంటి రోగాలను కూడా తొలి స్థాయిలోనే గుర్తించి నయం చేయగలిగే మెడికల్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. హృద్రోగ శస్త్ర చికిత్సలు, అవయవ మార్పిడి చికిత్సల విజయాలు తొంభై ఏడు శాతాన్ని దాటుతున్నాయి., సగటు జీవన ప్రమాణం కూడా డెబ్బయ్‌ ఏళ్ల ఇంతవరకూ సాధించింది ఒక ఎత్తు. రాబోయే పదేళ్లలో వైద్యరంగంలో రాబోతున్న మార్పులు మరో ఎత్తు. ఓ రకంగా చెప్పాలంటే రాబోయే దశాబ్దం దేశ వైద్యారోగ్య రంగాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఆ వివరాలు మీ కోసం...

కృత్రిమ మేధ హవా

రాబోయే రోజుల్లో రోగాన్ని నిర్ధారించేది, మందులు సూచించేది, ఆపరేషన్‌ చేసేది కృత్రిమ మేధే (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్‌) ఇప్పటికే అమెరికా, యూరప్‌ లాంటి దేశాల్లో వైద్య రంగంలో కృత్రిమ మేధ వాడకం మొదలైంది. ఓ పేషెంట్‌ను నిరంతరం కనిపెట్టుకుని ఉండటంలో ఏఐని మించిన గొప్ప నర్స్‌ ఉండదు. ఏఐ ద్వారా పేషెంట్‌ శారీరక, మానసిక పరిస్థితిని బట్టి చికిత్స చేస్తూ ఉంటుంది. అంటే కృత్రిమ మేధ రోగాన్ని బట్టే కాకుండా పేషెంట్‌ని బట్టి కూడా ట్రీట్‌మెంట్‌ చేస్తూ ఉంటుంది. ఇది రోగికి ఎంతో ఉపయోగకరం. అలాగే ఏఐ ఆల్గరిథమ్స్‌తో మెరుగైన మందులు, రికవరీ కూడా సాధ్యమవుతాయి. ఏఐకి రోబోటిక్‌ సర్జెరీని అనుసంధానం చేస్తే అద్భుతాలు ఆవిష్కరించవచ్చు. ఏ చిన్న పొరపాటూ లేకుండా, నూటికి నూరు శాతం ఖచ్చితత్వంతో ఆపరేషన్లు చేయగలగడం రోబోటిక్‌ సర్జెరీ ప్రత్యేకత. పెద్ద పెద్ద ఆపరేషన్లకు సైతం శరీరానికి చిన్న కన్నాలు మాత్రమే పెట్టి, విజయవంతంగా పూర్తి చేస్తాయి. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో జరిగే రోబోటిక్‌ సర్జరీలు పేషెంట్లకు తక్కువ నొప్పితో, తక్కువ సమయంలో సాంత్వననిస్తాయి. మరో రెండు మూడు దశాబ్దాల తర్వాత సర్జన్‌ ఎవరూ కత్తి పట్టకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ పనిని రోబోలు చూసుకుంటాయి.

కృత్రిమ అవయవాలు, త్రీడీ ప్రింటింగ్‌

రాబోయే పదేళ్లలో జరగబోయే మరో అద్భుతం కృత్రిమ అవయవాల తయారీ. వచ్చే దశాబ్దం నాటికి కృత్రిమ కిడ్నీ సిద్ధమవుతుంది. రెండు కిడ్నీలు పాడైపోయి, అవయవ దానం కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ఉంటోంది. కొత్త కిడ్నీని అమర్చుకోవడం లేదా, డయాలసిస్‌ మీద జీవితాంతం గడపడం అనే ఆప్షన్లే కిడ్నీ పేషెంట్లకి ఉంటాయి. అవయవదానం అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి పేషంట్లకు ఇబ్బందులు తప్పవు. మన దేశంలో కూడా లక్షలాది మంది కిడ్నీ వ్యాధి చివరి దశకు చేరుకుని నరకం అనుభవిస్తున్నారు. ఈ కష్టాలకు చెక్‌ చెప్పడానికి అమెరికాలో పని చేస్తున్న భారత సంతతి డాక్టర్‌ విషురాయ్‌ ఆర్టిఫిషియల్‌ ట్రాన్స్‌ప్లాంటబుల్‌ కిడ్నీని తయారు చేస్తున్నారు. అరచేతిలో పట్టే పెట్టెంత ఉంటే ఆ కృత్రిమ కిడ్నీని శరీరంలో అమర్చవచ్చు. సహజమైన కిడ్నీలానే అది పనిచేస్తుంది. రాబోయే దశాబ్దంలో అది కిడ్నీ పేషెంట్లకు అందుబాటులోకి వచ్చి. కోట్లాది కిడ్నీ పేషెంట్లకు సాంత్వన ఇవ్వనుంది.

ఓ వైపు కృత్రిమ కిడ్నీ తయారీ ప్రయత్నాలు జరుగుతూ ఉండగా, మరో వైపు త్రీడీ ప్రింటింగ్‌తో అవయవాల తయారీ అందుబాటులోకి వస్తోంది. అది గానీ విజయవంతమైతే కిడ్నీతో పాటు, లివర్‌, గుండె, ఊపిరితిత్తులతో సహా శరీరంలోని ప్రతీ అవయవాన్ని ముద్రించవచ్చు. మానవ అవయవాల తయారీకి అవసరమైన రసాయనాల సమ్మేళనంతా సహజమైన అవయవాలనే ముద్రించవచ్చు. ఈ అద్భుతం కూడా వచ్చే దశాబ్దంలో ఆవిష్కృతం కానుంది.

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌

మనిషి పుట్టుక నుంచి చావు వరకూ వెన్నంటి ఉండేవి మన జీన్స్‌ (జన్యువులు). ఒక రకంగా చెప్పాలంటే జననాన్ని, మరణాన్ని నిర్ణయించేది కూడా జీన్సే. ఓ తరం నుంచి మరో తరానికి తెలివితేటల్ని, అందచందాల్ని, శారీరక, మానసిక సమస్యల్ని సరఫరా చేసేది కూడా మానవ జన్యువులే. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ప్రక్రియ విజయవంతమైతే మానవాళిని వేధిస్తున్న క్యాన్సర్‌, గుండె రోగాలు సహా చాలా సమస్యలకు శాశ్వతంగా చెక్‌ పెట్టవచ్చు. కడుపులో ఉండగానే బిడ్డలోని అవకరాల్ని సరిదిద్ద వచ్చు. ప్రపంచానికి ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించవచ్చు. 2017 నుంచి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ప్రాజెక్ట్‌ మీద పరిశోధనలు ప్రారంభమయ్యాయి. 2.7 బిలియన్‌ డాలర్లతో ఈ ప్రాజెక్ట్‌ సిద్ధమవుతోంది. ఇల్యూమినియా అనే డీఎన్‌ఏ సీక్వెన్సింగ్‌ కంపెనీ ప్రపంచంలో జీన్స్‌ అన్నింటినీ సీక్వెన్స్‌ చేయడానికి ఓ కొత్త మెషీన్‌ కనిపెట్టినట్లు ఇటీవల ప్రకటించింది.

నానో టెక్నాలజీ

వచ్చే దశాబ్దంలో జరగబోయే మరో అద్భుతం నానో టెక్నాలజీ. చిన్న పరిమాణంలో తయారయ్యే వస్తువులతో పెద్ద పెద్ద ప్రయోజనాలు సాధించడం. మందులు, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీలో నానో టెక్నాలజీ వాడటం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడం దీని లక్ష్యం. నానో పార్టికల్స్‌, నానో డివైసెస్‌ క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రెండేళ్ల కిందట ఎం.ఐ.టి పరిశోధకులు ఓ ఎలక్ట్రానిక్‌ మందు బిళ్లను తయారు చేశారు. దానిని రిమోట్‌ ద్వారా నియంత్రించగలిగారు. స్మార్ట్‌ఫోన్‌ ద్వారా డ్రగ్‌ను విడుదల చేసేలా దానిని రూపొందించారు. నానో టెక్నాలజీ సృష్టించబోయే అద్భుతాలు ఇవి.

వచ్చే దశాబ్ది టెక్నాలజీది. ఈ శాస్త్ర, సాంకేతికత మనదేశంలోని సగటు మనిషికి కూడా అందాలని స్వాతంత్య్ర దినోతవ్సం సందర్భంగా ఆకాంక్షిద్దాం.

By Durgaram for Telugupost.com


Tags:    

Similar News