పాపం వార్నర్.. చివరి బంతి వరకూ
ఢిల్లీ క్యాపిటల్స్ ముంబయి చేతిలో ఓటమి పాలయింది. సీజన్ లో నాలుగో ఓటమిని సొంతం చేసుకుంది
ఢిల్లీ క్యాపిటల్స్ కు ఐపీఎల్ ఈసారి అస్సలు కలసి రావడం లేదనే అనిపిస్తుంది. చేతికందిన మ్యాచ్ చేజారిపోతుంది. నిన్న కూడా గెలవాల్సిన మ్యాచ్ ముంబయి ఇండియన్స్ చేతిలో ఓటమి పాలయింది. బ్యాటింగ్, బౌలింగ్ లో బలహీనంగా ఉన్న జట్టు అని మరోసారి తేలింది. ఢిల్లీ క్యాపిటల్స్ వరసగా ఈ సీజన్ లో నాలుగోసారి ఓటమి పాలయింది. చివరి బాల్ కు తమదే విజయం అన్న ధీమా కూడా మిగలడం లేదు.
ముంబయి జట్టు తొలి విజయం...
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో వార్నర్, అక్షర్ పటేల్ మాత్రమే రాణించారు. ఇద్దరూ అర్థశతకాన్ని పూర్తి చేసి జట్టుకు 20 ఓవర్లలో 173 పరుగులు తెచ్చిపెట్టారు. వారు తప్ప మిగిలిన బ్యాటర్లు రాణించలేకపోయారు. దీంతో తదుపరి బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు రోహిత్ శర్మ అర్ధ సెంచరీ, ఇషాన్ కిషన్ బాదుడుతో మొదలు కావడంతో గెలుపు వారిదేనని అనుకున్నా చివరి బంతి వరకూ ఉత్కంఠ సాగింది. ముంబయి ఇండియన్స్ కూడా ఇప్పటి వరకూ ఒక్క విజయాన్ని నమోదు చేయలేదు. అయితే చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా ఆపని సాధించి ఎట్టకేలకు ముంబయి ఇండియన్స్ గెలిచింది. తొలి విజయాన్ని ఈ సీజన్ లో నమోదు చేసుకుంది.