వింటేజ్ మహేంద్రుడి విన్నింగ్ షాట్.. ముంబై కు మరో ఓటమి..!

వరుసగా ఏడో మ్యాచ్‌లోనూ ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు దూరమైనట్లే..! చెన్నైతో జరిగిన మ్యాచ్‌లోనూ

Update: 2022-04-22 03:12 GMT

ముంబై ఇండియన్స్ పరాజయ పరంపర కొనసాగుతూ ఉంది. ఇప్పటి దాకా ఆడిన 7 మ్యాచ్ లలోనూ.. ఏడు ఓటములను మూటగట్టుకుంది. వరుసగా ఏడో మ్యాచ్‌లోనూ ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు దూరమైనట్లే..! చెన్నైతో జరిగిన మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది ముంబై. వి చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 17 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికే ప్రిటోరియస్ (22) అవుట్ అయ్యాడు. తర్వాత బ్రావో సింగిల్ తీశాడు. ఇక, చివరి నాలుగు బంతుల్లో 16 పరుగులు అవసరం. క్రీజులో ఉన్న ధోనీ నాలుగో బంతిని బౌండరీకి తరలించాడు. చివరి రెండు బంతుల్లో 6 పరుగులు అవసరం. ఐదో బంతికి రెండు పరుగులు తీసిన ధోనీ.. ఆరో బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఫలితంగా చెన్నై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తిలక్ వర్మ అర్ధ సెంచరీ (43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51) తో రాణించడంతో ముంబై ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ 32, హృతిక్ షాకీన్ 25, ఉనద్కత్ 19 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి 3, బ్రావో రెండు వికెట్లు పడగొట్టారు.
156 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు చెన్నై చాలానే కష్టపడింది. రాబిన్ ఊతప్ప 30, అంబటి రాయుడు 40, ధోనీ 28 (నాటౌట్), ప్రిటోరియస్ 22 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో డేనియల్ శామ్స్ నాలుగు, ఉనద్కత్ 2 వికెట్లు తీసుకున్నారు. చెన్నై బౌలర్ ముకేశ్ చౌదరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆడిన ఏడు మ్యాచుల్లోనూ ఓడిన ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండగా, ఏడు మ్యాచుల్లో రెండింటిలో విజయం సాధించింది చెన్నై.


Tags:    

Similar News