ఆర్సీబీకి మరో ఘోర ఓటమి
కోహ్లీ ఈ మ్యాచ్ లో ఓపెనర్‌గా వచ్చాడు. మొదట ఒక ఫోర్ కొట్టినా.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో ఆడడానికి చాలానే ఇబ్బంది పడ్డాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో ఓటమి ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో ఓడింది. ఆర్సీబీ తొలుత బంతితో రాణించి ప్రత్యర్థిని 144 పరుగులకే కట్టడి చేసింది. స్టార్స్ అందరూ అవుట్ అవ్వడం.. దినేష్ కార్తీక్ మ్యాజిక్ కూడా లేకపోవడంతో బెంగళూరు జట్టు పరాజయం పాలైంది. 145 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన బెంగళూరు ఛేజ్ చేయలేక ఓటమిని మూటగట్టుకుంది.
కోహ్లీ ఈ మ్యాచ్ లో ఓపెనర్‌గా వచ్చాడు. మొదట ఒక ఫోర్ కొట్టినా.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో ఆడడానికి చాలానే ఇబ్బంది పడ్డాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. 37 పరుగుల వద్ద కెప్టెన్ డుప్లెసిస్ (23), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0) అవుటయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన్, ఆర్. అశ్విన్ రాణించారు. బెంగళూరు జట్టులో కోహ్లీ సహా ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దినేష్ కార్తీక్ (6) కూడా విఫలమవ్వడంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 115 పరుగులకు బెంగళూరు ఆలౌట్ అయింది. షాబాజ్ అహ్మద్ (17), హసరంగ (18) పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో కుల్దీప్ సేన్‌కు 4 వికెట్లు దక్కగా అశ్విన్ 3, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీసుకున్నాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులు మాత్రమే చేసింది. బెంగళూరు బౌలర్ల ధాటికి రాయల్స్ జట్టులో ఆరుగురు ఆటగాళ్లు రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. రియాన్ పరాగ్ రాణించడంతో కనీసం 144 పరుగులైనా చేయగలిగింది. పరాగ్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జోస్ బట్లర్ 8 పరుగులకే అవుటయ్యాడు. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (7) అవుట్ అవ్వగా.. కెప్టెన్ సంజు శాంసన్ (27), అశ్విన్ (17), డారిల్ మిచెల్ (16) ఓ మోస్తరుగా రాణించారు. హిట్టర్ హెట్మెయర్ (3) కూడా విఫలమయ్యాడు. బెంగళూరు బౌలర్లలో హేజెల్ వుడ్ 2, సిరాజ్ 2, హసరంగ 2, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. అర్ధ సెంచరీతో రాణించిన రియన్ పరాగ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో రాజస్థాన్ 12 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. బెంగళూరు 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.