సీజన్‌కు ఒకరు.. టీం ఇండియాకు దొరికాడుగా
వెటరన్ ఆటగాళ్లకు ఐపీఎల్ ఒక వరంగా మారింది. ఈ సీజన్‌లో రహానే సక్సెస్ అవుతున్నాడు
ఐపీఎల్ 2023 ప్రారంభమై దాదాపు నెల రోజులు గడుస్తుంది. ప్రతి సీజన్‌లో ఏదో ఒక ఆటగాడు టీం ఇండియాకు సెలెక్ట్ అవుతూ వస్తున్నారు. గతంలో బాగా ఆడి ఫాం కోల్పోయి... టీం ఇండియాలో స్థానం పొందలేక అవస్థలు పడుతున్న అనేక మంది క్రికెటర్లకు నిజంగా ఐపీఎల్ ఒక వరమనే చెప్పాలి. ఐపీఎల్‌లో సక్సెస్ అయితే చాలు ఇక టీం ఇండియాలో స్థానం దక్కుతుందని భావించి ఒళ్లు దగ్గరపెట్టుకుని మరీ ఆడతారు క్రికెటర్లు.
గత సీజన్‌లో...
గత సీజన్‌లో బాగా ఆడిన దినేష్ కార్తీక్‌కు టీం ఇండియాలో చోటు దక్కింది. ఆసియా కప్ వరకూ దినేష్ కార్తీక్ కు చోటు దక్కింది. కానీ ఐపీఎల్‌లో చూపించిన దూకుడు మిగిలిన మ్యాచ్‌లలో మాత్రం దినేష్ కార్తీక్ చూపించలేక పోయారు. లేటు వయసులో తిరిగి టీం ఇండియాలో చోటు దక్కించుకోవడం కోసం ఐపీఎల్ ఒక వేదికగా ఉపయోగపడుతుందన్నది దినేష్ కార్తీక్ విషయంలో నిజమయింది. అందుకే ఫామ్ కోల్పోయిన అనేక మంది ఆటగాళ్లు తిరిగి టీం ఇండియాలో స్థానం చేజిక్కించుకోవడం కోసం ఈ రెండు నెలలు శ్రమిస్తారు.
వారికి వరం...
వెటరన్ ఆటగాళ్లకు ఐపీఎల్ ఒక వరంగా మారింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటి వరకూ అలాంటి ఆటగాళ్ల జాబితాలో అజింక్యా రహానే కనపడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్న రహానే ఇప్పటి వరకూ రెండు అర్థ సెంచరీలు నమోదు చేశాడు. మంచి దూకుడు మీద ఉన్నట్లు కనిపిస్తున్నాడు. పర్‌ఫెక్ట్ షాట్లతో సిక్సర్లు, ఫోర్ల మోత మోగిస్తున్నాడు. ఫాం కోల్పోయిన రహానే బీసీసీఐ దూరం పెట్టింది. టీం ఇండియాలో రహానే ఆడి చాలా రోజులవుతుంది. వన్డే, టీ 20లలో రహానే పేరును కూడా బీసీసీఐ సెలక్టర్లు అస్సలు పరిశీలనలోకి కూడా తీసుకోవడం లేదు.
ఈ సీజన్‌లో....
కానీ ఈసారి బీసీసీఐ రహానే పేరును పరిశీలించే అవకాశముందంటున్నారు. రహానే దూకుడు టీం ఇండియాకు అవసరమని భావిస్తున్నారు. యువ ఆటగాళ్లు వరసగా విఫలమవుతున్న సమయంలో రహానే వంటి ఆటగాళ్లను వన్డే, టీ 20లకు సెలెక్ట్ చేస్తే భారత్ కు కొంత రన్స్ విసయంలో ఊరట లభిస్తుందన్న అంచనాలు వినపడుతున్నాయి. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఫస్ట్ డౌన్ లో క్రీజ్‌లోకి వస్తున్న రహానే మంచి స్కోరునే సాధించాడు. నిన్న కోల్‌కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో నాటౌట్ గా నిలిచి భారీ స్కోరుకు సహకరించాడు. ఇందులో ఐదు సిక్సర్లు, ఆరు ఫోర్లు ఉన్నాయి. త్వరలోనే టీం ఇండియా జెర్సీలో రహానే కనిపించాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ రహానే.