భయం లేదు.. బెరుకులేదు.. కసి మాత్రం టన్నులు..?
ఓటమి పాలయ్యే మ్యాచ్ ను లక్నో జెయింట్స్ ఆటగాళ్లు చెన్నై సూపర్ కింగ్స్ నుంచి విజయాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు.
ఓటమి అంచున ఉన్నామన్న భయం వారిలో కన్పించలేదు. కొట్టాలన్న కసి మాత్రమే వారిలో ఉంది. ఫలితంగా ఓటమి పాలయ్యే మ్యాచ్ ను కుర్రోళ్లు చెన్నై సూపర్ కింగ్స్ నుంచి విజయాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. నిజానికి లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి ఖరారయింది. మ్యాచ్ చూసే ప్రతి అభిమాని అదే డిసైడ్ అయ్యారు. కానీ కుర్రోళ్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశారు. ఉద్దండులు, అనుభజ్ఞులు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తమ విజయాన్ని ఆపలేదన్న భరోసా వారిలోకన్పించింది.
భారీ లక్ష్యం.....
211 భారీ లక్ష్యం వారి కళ్ల ముందు ఉంది. ఇక నాలుగు ఓవర్లున్నాయి. 60కి పైగా పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో ఎవిన్ లూయిస్, ఆయూష్ బదాని మాత్రమే ఉన్నారు. వీరిలో ఏమాత్రం ఓడిపోతామన్న భయం కన్పించలేదు. కొట్టి తీరతామన్న కసి మాత్రమే కన్పించింది. ఆ కసి కూడా టన్నుల్లోనే. అవతల చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడుతున్నామన్న బెరకు ఏమాత్రం లేదు. అంతే అందిన బంతిని అందినట్లు బాదారు. లక్నో సూపర్ జెయింట్స్ కు సూపర్ విక్టరీ సాధించి పెట్టారు. అనుభవం కొన్ని సార్లు మాత్రమే పనికి వస్తుంది. కసి కొద్దీ కొడితే లక్ష్యం చిన్నదవుతుందని ఈ కుర్రోళ్లిద్దరూ నిరూపించారు. ఈ మ్యాచ్ చూసిన వారందరికీ ఓటమి నుంచి వారిద్దరూ ఎలా గట్టెక్కించారో అర్థమవుతుంది.