అతడి ఆట తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన మహేళ జయవర్ధనే
అతను మొదటి కొన్ని మ్యాచ్‌లలో మంచి ఆరంభం ఇచ్చాడని.. ఆ తర్వాత గత నాలుగు గేమ్‌లలో కొంచెం ఇబ్బంది పడ్డాడని అన్నారు.
ముంబై ఇండియన్స్ వరుస ఓటములు ఫ్యాన్స్ ను మాత్రమే కాదు.. ముంబై ఇండియన్స్ కోచింగ్ బృందాన్ని కూడా ఎంతగానో బాధిస్తోంది. ముఖ్యంగా స్టార్ ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు ఈ సీజన్ లో..! ఎడమచేతి వాటం బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 15.25 కోట్లకు ఎంచుకుంది. రోహిత్ శర్మతో కలిసి జట్టుకు మంచి ప్రారంభానికి ఇవ్వడానికి సహాయపడతాడని ఆశించింది. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్ లో 81 పరుగులు చేసిన తర్వాత, కిషన్ ఘోరంగా విఫలమయ్యాడు. అతని ఫామ్ కలవరపెడుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో 28.43 సగటుతో 199 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా ఎనిమిదో పరాజయం తర్వాత.. ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే మాట్లాడుతూ, కిషన్ ఆట తీరును తాము గమనిస్తూ ఉన్నామని అన్నారు.
అతను మొదటి కొన్ని మ్యాచ్‌లలో మంచి ఆరంభం ఇచ్చాడని.. ఆ తర్వాత గత నాలుగు గేమ్‌లలో కొంచెం ఇబ్బంది పడ్డాడని అన్నారు. ఈ గేమ్ తర్వాత అతని మనసులో ఏమి ఉందో తెలుసుకోవడానికి నేను అతనితో ఇంకా మాట్లాడలేదు. మేము దానిని చర్చించాలని అనుకుంటూ ఉన్నాం. అతని సహజమైన ఆటను ఆడేందుకు మేము అతనికి స్వేచ్ఛనిచ్చాము, గత కొన్ని గేమ్‌లలో అతను సరిగ్గా అతడి ప్రణాళికలను అమలు చేయలేకపోయాడని వర్చువల్ పోస్ట్-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జయవర్ధనే చెప్పారు. మేము అతనితో మాట్లాడాం. లక్నోతో మ్యాచ్ లో కూడా రోహిత్ బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, అతను కష్టపడ్డాడని మహేళ తెలిపాడు.
లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో కిషన్ 20 బంతుల్లో 8 పరుగులు చేసి రాణించలేకపోయాడు. అతను స్ట్రైక్ రొటేట్ చేయడంలో విఫలమయ్యాడు . చివరికి ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో రవి బిష్ణోయ్ చేతిలో ఊహించని విధంగా అవుట్ అయ్యాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 36 పరుగుల తేడాతో విజయం సాధించి ఐపీఎల్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.