ఐపీఎల్ కిక్ మామూలుగా లేదుగా?
ఐపీఎల్ పదిహేనో సీజన్ ప్రారంభమయిన రెండో రోజే అదిరిపోయే రెండు మ్యాచ్ లను చూశాం
ఐపీఎల్ మ్యాచ్ లకు అంత ఆదరణ ఉంటుందంటే ఎందుకుండదు? ఊపిరి బిగబట్టే విధంగా మ్యాచ్ లు నడుస్తాయి.ఊహించని విజయాలు లభిస్తాయి. అంచనాలు ఎవరికీ అందవు. అందుకే ఐపీఎల్ కు అంతటి ఆదరణ. ఏటా ఐపీఎల్ మ్యాచ్ లను కోట్లు వెచ్చించి నిర్వహిస్తారంటే అందుకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణే. ప్రేక్షకులు కూడా ఊరికే ఆదరించరు. మజా ఉంటేనే మ్యాచ్ లను ఆశీర్వదిస్తారు.
రెండో రోజు తొలి మ్యాచ్....
ఐపీఎల్ పదిహేనో సీజన్ ప్రారంభమయిన రెండో రోజే అదిరిపోయే రెండు మ్యాచ్ లను చూశాం. ముంబయి ఇండియన్స్ 177 పరుగులు చేసినా ఢిల్లీ క్యాపిటల్స్ అవలీలగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్లు కోల్పోయినా బౌలర్లు బ్యాటర్లుగా రాణించి దుమ్మురేపడంతో ఢిల్లీదే ఊహించని విజయం వరించింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయిన మ్యాచ్ ను ఆదివారం కావడంతో కోట్లాది మంది క్రికెట్ అభిమానులు చూసి కేరింతలు కొట్టారు.
ఊహించని విజయం.....
ఇక మరో మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగానే సాగింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తొలుత బ్యాటింగ్ చేసి 205 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని అధిగమించడం సాధ్యం కాదని అంచనా వేశారంతా. పంజాబ్ కింగ్స్ తొలి అపజయం నమోదయినట్లేనని భావించారు. కానీ 205 పరుగుల లక్ష్యాన్ని ఇంకో ఒవర్ మిగిలి ఉండగానే పంజాబ్ కింగ్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఐపీఎల్ మ్యాచ్ లకు అంతటి ఆదరణ. ఆటగాళ్లు ఎవరైనా సరే. ఫోర్, సిక్సర్ కొట్టగానే స్టేడియం అరుపులు, చప్పట్లతో దద్దరిల్లుతుంది. దటీజ్ ఐపీఎల్. మున్ముందు ఇక ఎలాంటి మ్యాచ్ లు కిక్ ఇస్తాయన్నది చూడాలి.