ఊరూర బలగం.. తెరలు కట్టి మరీ చూస్తోన్న పల్లె ప్రజలు
ఒకానొకప్పుడు గ్రామాల్లో పెద్ద తెరలు ఏర్పాటు చేసి.. వాటిపై సినిమాలను ప్రదర్శించేవారు. ఇప్పుడు తెలంగాణలోని పల్లె పల్లెలో..
కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా బలగం. ప్రియదర్శి, కావ్య హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి, కొడుకు హర్షిత్ లు కలిసి రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.20 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే బలగం సినిమాకు రెండు అంతర్జాతీయ అవార్డులు కూడా రావడంతో చిత్రబృందం హర్షం వ్యక్తం చేస్తోంది.
ఒకానొకప్పుడు గ్రామాల్లో పెద్ద తెరలు ఏర్పాటు చేసి.. వాటిపై సినిమాలను ప్రదర్శించేవారు. ఇప్పుడు తెలంగాణలోని పల్లె పల్లెలో బలగం సినిమాను ఇలాగే చూస్తూ.. కంటతడి పెట్టుకుంటున్నారు ప్రజలు. అందరూ కలిసి అలా సినిమా చూడటం ఒక మధురమైన జ్ఞాపకం. అలాంటి జ్ఞాపకాలు ఇప్పటికీ ఉండటం, పైగా బలగం సినిమాను ఊరంతా కలిసి చూడటం అనేది ఆ సినిమాను అసలైన విజయం అనే చెప్పాలి.
బంధాలను, అనుబంధాలను మరచిపోయి, పగలు.. ప్రతీకారాలంటూ అయినవారికి దూరమవుతున్న నేటి సమాజానికి బంధాల విలువ గురించి అద్భుతంగా చూపించింది బలగం. సినిమా చూస్తున్నంతసేపు అందరూ కంటతడి పెట్టుకుంటున్నారు. సినిమా కనిపించే క్యారెక్టర్లలో తమను తాము ఊహించుకుని కుమిలిపోతున్నారు. తెలంగాణలోని పల్లెల్లో బలగం సినిమా ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.