Chiranjeevi : చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించబోతున్నారా..?
మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించబోతున్నారా..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త..
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలతో ఎంత అభిమానం సంపాదించుకున్నారో, తన సేవా కార్యక్రమాలతో అంతకుమించి ప్రజాధారణ పొందారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ ప్లాంట్, అంబులెన్స్ సర్వీస్ అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక గతంలోనే చిరంజీవి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2006లో 'పద్మ భూషణ్' అవార్డుతో సత్కరించింది. ఇక ఇప్పుడు తాజాగా మరో సత్కారంతో చిరుని భారత్ ప్రభుత్వం గౌరవించడానికి సిద్దమవుతుందట.
కరోనా కష్ట సమయంలో ఓ సంస్థని ఏర్పాటు చేసి ఆహార పదార్దాలు డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా, ఆక్సిజన్ ప్లాంట్ అండ్ అంబులెన్స్ సర్వీస్‌లు మొదలుపెట్టి కరోనా బారిన పడిన బాధితులకు రక్షకుడిగా మారారు. ఇక ఈ సేవలతో పాటు సినిమా ఇండస్ట్రీకి ఆయన అందించిన సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. చిరంజీవిని పద్మ విభూషణ్‌తో సత్కరించాలని నిర్ణయించిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ పురస్కారం గురించి రిపబ్లిక్ డే నాడు అధికారికంగా ప్రకటించనున్నారట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఇక వైరల్ అవుతున్న ఈ వార్తని చూసిన మెగా అభిమానులు.. ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ విషయాన్ని నెట్టింట వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు. కాగా ఈ నెల 22న అయోధ్యలో జరగబోయే శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపనకి చిరంజీవికి కూడా ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ తో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రామ విగ్రహ ప్రతిష్టాపనకి హాజరుకాబోతున్నారు.