నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ (87) ఇకలేరనే చేదు నిజాన్ని మనమందరూ దిగమింగాలి. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య నాగేశ్వరమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కైకాల మృతితో చిత్ర పరిశ్రమతోపాటు ఆయన అభిమానుల్లో విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సత్యనారాయణ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కైకాల సత్యనారాయణ భౌతికకాయానికి శనివారం ఉదయం పదిన్నర గంటలకు ఫిలింనగర్లోని మహాప్రస్థానంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరనున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వపరంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. కైకాల అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు కేసీఆర్. మహాప్రస్థానంలో జరిగే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ను ఆదేశించారు.