తేజ వల్ల అయ్యేదంటారా..!

ఎన్టీఆర్ బయోపిక్ కి ముందు తేజని దర్శకుడిగా తీసుకున్నారు. చాలా రోజుల తరవాత నేనే రాజు నేనే మంత్రితో హిట్ కొట్టిన తేజని ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడిగా [more]

Update: 2019-01-11 07:51 GMT

ఎన్టీఆర్ బయోపిక్ కి ముందు తేజని దర్శకుడిగా తీసుకున్నారు. చాలా రోజుల తరవాత నేనే రాజు నేనే మంత్రితో హిట్ కొట్టిన తేజని ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడిగా ప్రకటించడం.. తేజ ఎన్టీఆర్ జీవిత కథ మీద కూర్చుని అన్ని పర్ఫెక్ట్ అనుకున్నాకే ఎన్టీఆర్ బయోపిక్ ని పట్టాలెక్కించాడు బాలకృష్ణ. ఎన్టీఆర్ బయోపిక్ ఓపెనింగ్ రోజున మంచి హడావిడి చేసిన బాలకృష్ణ.. తేజతో కొన్ని రోజులు షూటింగ్ సజావుగా జరిపాడు. కానీ తేజ ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలను మోయలేక ఎన్టీఆర్ బయోపిక్ నుండి బయటికెళ్లిపోయాడు. ఇలా చెప్పింది కూడా బాలయ్యే. ఇక బాలకృష్ణ బసవతారకం పాత్రధారి విద్యాబాలన్ కి సినిమా ఆగిపోయిందని చెప్పడానికి వెళితే అక్కడికి బాలయ్యని కలవడానికి వచ్చిన క్రిష్ నేను ఎన్టీఆర్ బయోపిక్ ని డైరెక్ట్ చెయ్యనా బాబు అని అడగడంతో బాలయ్య.. క్రిష్ కి ఎన్టీఆర్ బయోపిక్ పగ్గాలు అప్పగించాడు.

సఫలమైన క్రిష్

ఇక ఏ మాటకామాటే చెప్పుకోవాలి క్రిష్ మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ ని పరుగులు పెట్టించాడు. మొదటి నుండి సినిమా మీద హైప్ పెంచేలా బయోపిక్ పాత్రలను పోస్టర్స్ రూపంలో ప్రేక్షకుల మీదకి వదిలాడు. బాలయ్య ఎనర్జీ, క్రిష్ వేగం అన్ని కలిసి ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా విభజించడం… అందులో మొదటి భాగం కథానాయకుడు ప్రేక్షకుల ముందుకు రావడం కేవలం ఐదు నెలలోనే జరిగిపోయాయి. క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ కి సమర్థుడని బాలయ్య ఎందుకు అనుకున్నాడో కానీ… నిజంగా నేడు అది నిరూపణ అయ్యింది. ఎన్టీఆర్ జీవితంలో వ్యక్తిగతం, నట జీవితం కలిపి కథానాయకుడుగా మలిచాడు. ఇక ఎన్టీఆర్ గా బాలకృష్ణని చూపించడంలో క్రిష్ 100 శాతం సక్సెస్ అయ్యాడు. అలాగే పాత్రకు తగిన సంభాషణలతో సినిమా మొత్తాన్ని నడిపించాడు. ఎన్టీఆర్ నట జీవితంలోని పాత్రలను ఒక్కొక్కటిగా తెరమీద చూపించడంలోనూ క్రిష్ సఫలీకృతుడయ్యాడు.

 

తక్కువ కాలంలోనే పూర్తి చేసిన క్రిష్

బాలయ్యని ఎన్టీఆర్ గా చూపించడంలో, విద్యబాలన్ ని బసవతారకం పాత్రలో చూపించడం, ఇతర పాత్రలకు నటుల ఎంపిక ఎంత చకచకా చేసినా ఎక్కడా తడబడలేదు క్రిష్. ఇక బాలకృష్ణ సహకారం కూడా క్రిష్ కి తోడవడంతో.. ఈ కథానాయకుడు చిత్రీకరణను క్రిష్ ఈజీగానే చేసాడు. ఇక కథానాయకుడికి ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి మార్కులు పడడమే కాదు… రివ్యూ రైటర్స్ కూడా మంచి రేటింగ్స్ ఇచ్చేసారు. ఇక కథానాయకుడు పని ఫినిష్ అవ్వగా మహానాయకుడుకి కొద్దిగా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో బాలయ్య – క్రిష్ లు సంక్రాతి పండగ వేళ కూడా పని చెయ్యబోతున్నారు. మరి కథానాయకుడు కాంట్రవర్సీలకు తావివ్వని.. క్రిష్ బృందం మహానాయకుడుని కూడా ఇలానే మలిచిందో లేదంటే… ఎమైనా సమస్యలొస్తాయా అనేది మహానాయకుడు సెన్సార్ కి వెళ్లినప్పుడు కానీ బయటకు రాదు. ఏది ఏమైనా క్రిష్ దర్శకుడుగా ఎన్టీఆర్ బయోపిక్ ని అద్భుతంగా మలిచాడు కానీ.. తేజ వల్ల మాత్రం ఇదంతా అయ్యేదా అంటే కాస్త డౌటే అంటున్నారు నందమూరి అభిమానులు.

Tags:    

Similar News