Sankranthi : అనకాపల్లి నుంచి అమెరికా వరకూ సంక్రాంతి సంబరాలే
సంక్రాంతి సంబరాలు మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజులు జరిగే ఈ సంబరాల కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నారు
సంక్రాంతి అంటే చాలు.. పిల్లా పెద్దలు అందరూ ఎంత షుషారయిపోతారంటే చెప్పటం ఎవరి వల్లా కాదు. ఏటా వచ్చే పండగే అయినా సంక్రాంతికి అదో స్పెషల్. కొత్త బట్టలు.. సొంతూళ్లకు పయనం.. కడుపునిండా తినేటంత స్వీట్లు.. హాట్లు... ఇలా ఒక్కటేమిటి.. సంక్రాంతి అంటేనే రంగుల పండగ. ఇంటి ముందు నెల రోజుల పాటు రంగవల్లికలు వేసి మరీ జరుపుకునే అతిపెద్ద పండగ. పల్లె నుంచి పట్టణాల వరకూ సంక్రాంతి శోభతో జిగేల్ మనిపిస్తాయి. పేరుకు పల్లెల్లో జరుపుకునే పండగే అయినా.. ఇప్పుడు నగరాలకు.. పట్టణాలకు పాకింది. పాత జనరేషన్ అలవాట్లను నేటి యువత అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరకు అమెరికాలోనూ మనోళ్లు ఆన్ లైన్ లో పిడకలు ఆర్డర్ చేసి మరీ పండగ చేసుకునేంతగా సంక్రాంతి మరింతగా శోభాయమానంగా మారింది.
పెద్ద పండగగా...
ఆంధ్రప్రదేశ్ లో దీనిని పెద్ద పండగగా చేసుకుంటారు. సంప్రదాయంగా వస్తున్న ఆచరాలను ఈ పండగలోనే చూస్తాం. ఇంటి ముందు ముగ్గులు, గంగిరెద్దులు.. భోగిపళ్లు, గొబ్బెమ్మలు.. హరిదాసులు.. ఒక్కటేమిటి హడావిడి అంతా ఇంతా కాదు. అందుకే సంక్రాంతి మూడు రోజుల పాటు ఇంటిపట్టునే ఉండి ఎంజాయ్ కి ఎంజాయ్ చేస్తూనే అటు స్పీడ్ యుగంలో అలసి పోయిన శరీరానికి కాసింత నులక మంచాలపై విశ్రాంతినిస్తారు. అలాంటి సంక్రాంతి పండగకు తెలుగు నేల సిద్ధమయింది. కోనసీమ, కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర దేని ప్రత్యేకత దానిదే. దేని రుచులు దానివే. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రుచి జిహ్వచాపల్యానికి శుభం కార్డు వేసే పండగగా దీన్ని చెప్పుకుంటారు.
భోగి రోజున...
భోగిరోజు తెల్లవారు జామున లేచి ఇంటి ముందు పెద్ద పెద్ద మంటలు వేసుకుని అందులో పాత వస్తువులను వేస్తారు. అది అనాదిగా వస్తున్న ఆచారం. చెడు పోయి మంచి చేకూరాలన్న ఉద్దేశ్యంతో బోగిమంటల్లో పనికిరాని పాత వస్తువును వేస్తారు. ఆ మంటల్లోనే పొంగలి చేసే వారుంటారు. దానికి దేవుడి ప్రసాదంగా భావిస్తారు. ఇక సాయంత్రం భోగి పళ్లను చిన్న పిల్లలకు పోసి పేరంటాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. బొమ్మల కొలువులను కూడా తీర్చి దిద్ది అమ్మవారిని ప్రార్ధిస్తారు. కుటుంబమంతా కొత్త ఏడాది ఆనందంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. భోగి పండ్లను పిల్లల తలలపై పోస్తే వృద్ధిలోకి వస్తారని నమ్ముతారు. అందుకే ఇప్పటికీ ఈ ఆచారాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఆడవాళ్లంతా పట్టు పరికిణీలు ధరించి ఈ పేరంటాలకు హాజరయి ఇంటింటా తిరుగుతూ సందడి చేస్తుంటారు.
సంక్రాంతికి...
ఇక తరువాతి రోజు సంక్రాంతి. సూర్యుడు సంవత్సరమంతా పన్నెండు రాశుల్లో సంచరిస్తాడు. అయితే ధనురాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించే సమయానికి స్పెషల్ ఉంది. అప్పటివరకూ సూర్యుడు దక్షిణ దిక్కుగా ప్రయాణించి మకరరాశిలో ప్రవేశించే నాటికిఉత్తర దిక్కుగా పయనిస్తాడు. అందుకే ఈ సమయాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తుంటారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వంటి వాతావరణం ఈ కాలంలోనే మనం చూస్తుంటాం. మకరరాశిలోకి ప్రవేశిస్తాడు కనుక దీనిని మకర సక్రమణం.. మకర సంక్రాంతి అని కూడా పిలుస్తారు. దాదాపు ప్రతి ఏడాది అటు ఇటుగా ఒక తేదీ తేడాతో ఒకే సమయానికి సంక్రాంతి వస్తుంది. ఈ సమయంలో మరణిస్తే నేరుగా స్వర్గానికి చేరుకుంటారని ప్రతీతి. ఇక రైతుల పండగగా దీనిని పిలుస్తారు. సంక్రాంతికి పంట చేతికి రావడంతో కొత్త బియ్యం ఇంట అడుగు పెడుతుంది. దానితోనే వంట చేసుకుంటారు. పిండి వంటలు తయారు చేసుకుంటారు. దీనివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందని నమ్ముతారు. అజీర్ణం చేయదని అంటారు. సంక్రాంతి రోజుల మాంసాహారాన్ని మాత్రం ఎవరూ ముట్టరు. సాత్వికాహారాన్ని మాత్రమే భుజిస్తారు.
కనుమ అనేది...?
ఇక మూడో రోజు కనుమ. దీనిని పశువుల పండగగా భావిస్తారు. తమ ఇంటికి ధాన్యరాశులను తెచ్చి పెట్టడంలో సహకరించే పశువులను కనుమ రోజు ప్రత్యేకంగా అలంకరిస్తారు. పశువులకు కుంకుమ, పసుపుతో అలంకరించి వాటికి ఇష్టమైన ఆహారాన్ని పెడతారు. ఆవులు, ఎద్దులు ఇలా తమకు సాగులో సహకరించిన పశువులను, వస్తువులను పూజిస్తారు. ఇక ఈరోజు మాంసాహారాన్ని తీసుకుంటారు. కనుమ రోజు గారెలు, చికెన్, మటన్ తినదే ఎవరూ ఊరుకోరు. ఊరంతా అవే ఘుమఘుమలు. పుల్లుగా తిని హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. కనుమ రోజు కాకి కూడా కదలదంటారు. ఎవరూ ప్రయాణం చేయడానికి కూడా సాహసించరు. ప్రయాణం చేస్తే ఆపద ఎదురవుతుందని భావిస్తారు. ఇక నాలుగో రోజు ముక్కనుమగా చేసుకుంటారు. తమ ఇంట మరణించిన పెద్దలకు కూడా పూజలు చేస్తారు. వారికి ఇష్టమైన ఆహారాన్ని వండుకుంటారు. ఇలా నాలుగు రోజులు పాటు జరిగే సంక్రాంతి పండగ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.