ఇంతకీ సంక్రాంతి ఎప్పుడు...? పండితులు ఏమంటున్నారు?
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ పై సందిగ్దత నెలకొంది.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ పై సందిగ్దత నెలకొంది. దేశమంతా సంక్రాంతి పండగను ఈ నెల 14వ తేదీన జరుపుకుంటుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం జనవరి 15వ తేదీన సంక్రాంతి పండగ అని పంచాంగ కర్తలు చెబుతున్నారు. దీంతో తెలుగు ప్రజలు సంక్రాంతి పండగను ఎప్పుడు జరుపుకోవాలన్న దానిపై సందిగ్దతలో ఉన్నారు. నిజానికి ఏటా సంక్రాంతి పండగ 13, 14, 15 తేదీల్లో వస్తుంది.
ప్రతి ఏటా...
13వ తేదీన భోగి, 14న మకర సంక్రాంతి, 15న కనుమగా పండగను తెలుగు ప్రజలు జరుపుకుంటారు. అయితే ఈసారి 15న సంక్రాంతి అని దేవస్థాన పండితులు చెప్పడంతో అయోమయం నెలకొంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ అలుముకుంది. ప్రజలు తమ సొంతూళ్లకు చేరుకున్నారు. పిండి వంటలను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ సంక్రాంతి ఎప్పుడనే మీమాంసం మాత్రం వదలడం లేదు.
సిద్ధాంతులు మాత్రం....
అయితే ప్రముఖ పంచాంగ కర్త శ్రీనివాస గార్గేయ మాత్రం జనవరి 14వ తేదీన 2.29 గంటలకు సంక్రాంతి ప్రవేశిస్తుందని చెబుతున్నారు. సిద్ధాంతులు, పంచాంగ ప్రముఖులు వేర్వేరు తేదీలు చెబుతుండటంతో సంక్రాంతిపై తెలుగు రాష్ట్రాల్లో గందరగోళం నెలకొంది. దీనిపై ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.