Sri RamaNavami 2023 : రాములోరి కల్యాణం తర్వాత పానకం ఎందుకు ఇస్తారు ?
ఉగాది నుంచి ఉడుకు మొదలవుతుంది. రోజులు గడిచేకొద్దీ వేడి పెరుగుతుంది. అందుకే శ్రీరామనవమికి తాటాకు పందిళ్లు వేస్తారు.
హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి పండుగకో ప్రసాదం ఉంటుంది. భగవంతుడికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం దానిని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. ఋతువుని బట్టీ దేవునికి సమర్పించే నైవేద్యం మారుతుంటుంది. ఉగాదితో వేసవి ఆరంభమవుతుంది. ఉగాదికి షడ్రుచుల పచ్చడిని ఎలా అయితే స్వీకరిస్తామో.. ఆ తర్వాత వచ్చే శ్రీరామనవమి రోజున రాములోరి కల్యాణం అనంతరం భక్తులకు వడపప్పు, పానకాన్ని ప్రసాదంగా పంచిపెడతారు.
ఉగాది నుంచి ఉడుకు మొదలవుతుంది. రోజులు గడిచేకొద్దీ వేడి పెరుగుతుంది. అందుకే శ్రీరామనవమికి తాటాకు పందిళ్లు వేస్తారు. అయితే పానకాన్ని ఎందుకు పంచడం వెనుక ఒక ఆరోగ్య రహస్యం ఉంది. పానకం తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. పానకంలో వేసే బెల్లం శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అందులోనే ఐరన్ కూడా ఉంటుంది. అలాగే మిరియాలు కఫాన్ని తగ్గిస్తాయి. శొంఠి వల్ల దగ్గు రాకుండా ఉంటుంది. శరీరంలో ఉష్ణశాతాన్ని సమంగా ఉంచుతుంది.
యాలుకలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. ఇది జీర్ణప్రక్రియను సరిచేస్తుంది. తులసీదళం శ్రీరామ చంద్రులవారికి ప్రీతిపాత్రమైనది. రామనవమి రోజున రాములవారిని ముఖ్యంగా తులసీదళంతోనే పూజిస్తారు. తులసి.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే వడపప్పు వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. అలాగే బుధగ్రహానికి పెసరపప్పు ప్రీతిపాత్రమైనది. అలా అని ప్రతిరోజూ పానకాన్ని తాగరు. అందుకే వేసవి ఆరంభంలో రాములవారి కల్యాణం జరిగిన సందర్భంగా.. ప్రజలందరికీ ఇలా పానకాన్ని పంచిపెడతారు.