Summer Effect : మార్చి నెలలోనే చుక్కలు కనపుడుతున్నాయిగా?
ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. మార్చి నెలలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.;

ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. మార్చి నెలలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అసలు ఉదయం ఏడు గంటల నుంచే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత గతంలో కంటే ఎక్కువగా ఉంటుందని, సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ పరిస్థితులు, చెట్లు కొట్టివేయడం వంటి కారాణాలతో ఎండల తీవ్రత ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే ఎక్కువగా ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా మే నెలలో నలభై ఐదు నుంచి యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వడదెబ్బకు...
వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రజలు తమ జీవన విధానాన్ని మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి రోడ్డుపైకి రావాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఎండల తీవ్రతతో పాటు వడగాలులు కూడా గత రెండు రోజుల నుంచి ఎక్కువగా ఉన్నాయి. రాను రాను వడగాల్పుల తీవ్రత మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రోజు వారీ కూలీలు, కార్మికులు, చిరు వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ తగిలే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఎండకు నీడపట్టున ఉన్నా వడగాలులు చెవుల్లోకి పోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని కూడా కొందరు చెబుతున్నారు.
ఉష్ణోగ్రతలు భారీగా...
ఇక ఎండల దెబ్బకు ఇంట్లోనే ఉండటం ఉత్తమమని వైద్యులు కూడా చెబుతున్నారు. ప్రధానంగా దీర్ఘకాలిక రోగులు, గుండె జబ్బులున్న వారు, వృద్ధులు, చిన్నారులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శరీరం డీ హైడ్రేషన్ కు లోను కాకుండా నిరంతరం నీటిని తాగుతుండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటాయి. మార్చి నెలలోనే నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశముందన్న అంచనాలు కూడా వినపడుతున్నాయి. ఉక్కపోత, వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఈ ఏడాది వేసవి గడిస్తే చాలు అని చాలా మంది కోరుకుంటున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు.